* జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలన
* సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ….
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశాన్ని, ఈ నెల 18న వనదేవతల నెలవైన మేడారంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. షెడ్యూల్ ప్రకారం, 18వ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు. అక్కడే కేబినెట్ భేటీ నిర్వహించి, రాత్రికి వనదేవతల సన్నిధిలోనే బస చేయనున్నారు.
ప్రజల మధ్య మంత్రివర్గ సమావేశం
రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ద్వారా తనదైన రాజకీయాన్ని ప్రదర్శించబోతున్నారు. గత పదేళ్లలో కేబినెట్ సమావేశాలు కేవలం ప్రగతి భవన్ లేదా సచివాలయం వంటి మూసి ఉన్న గదులకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మేడారం వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రంలో కేబినెట్ నిర్వహించడం ద్వారా, తమ ప్రభుత్వం ప్రజల చెంతకే పాలన ను తీసుకెళ్తోందనే సంకేతాలను ఆయన బలంగా పంపిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, మేడారం జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడానికి ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు ముందు కొత్త వ్యూహం
మున్సిపల్ ఎన్నికల ప్రచార వేడిలో ఉన్న తరుణంలో ఖమ్మం సభ ముగించుకుని నేరుగా మేడారం వెళ్లడం ద్వారా రేవంత్ రెడ్డి తన పనితీరును కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక అంశాలను మేళవిస్తూ ఆయన వేస్తున్న అడుగులు రేవంత్ ఒక ప్రత్యేక శైలి ఉన్న నాయకుడని చాటిచెబుతున్నాయి. మేడారం కేబినెట్లో గిరిజన సంక్షేమం లేదా ప్రాంతీయ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గతంలో పలువురు ముఖ్యమంత్రులదీ ఇదే వ్యూహం
గతంలో కొందరు ముఖ్యమంత్రులు కూడా ఇలాగే రాజధానికి వెలుపల కేబినెట్ సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరంలో జిల్లా కలెక్టర్ల సమావేశంతో పాటు కేబినెట్ భేటీ నిర్వహించగా, ఏపీ విభజన తర్వాత అమరావతి నిర్మాణం కోసం బస్సులోనే కేబినెట్ భేటీ జరిపి రికార్డు సృష్టించారు. అటు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా అక్కడే కేబినెట్ నిర్వహించగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం నర్మదా నది ఒడ్డున మంత్రులతో భేటీ అయ్యారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి ఏకంగా అడవిలో టెంట్లలో కేబినెట్ మీటింగ్ పెట్టి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రేవంత్ ఆ జాబితాలో చేరుతున్నారు.
……………………………………

