ఆకేరున్యూస్, మేడారం : మేడారంలో నేటినుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రూ.4,800 చార్జీగా నిర్ణయించారు.
హన్మకొండ నుంచి సేవలు..
అలాగే హన్మకొండ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి రూ.35,999గా ఛార్జీలు నిర్ణయించారు. తాడ్వాయి మండలం ఎలుబాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈ నెల 31వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
………………………………………
