ఆకేరు న్యూస్, డెస్క్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అంటే కేవలం భక్తి మాత్రమే కాదు. అది ప్రకృతికి, ఆదివాసీ జీవన విధానానికి ప్రతిరూపం. గుడి గోపురాలు, శిలా విగ్రహాల కంటే అడవిని, తల్లి అని పవిత్రంగా భావించే కోయ గిరిజనుల సంస్కృతికి ఇది నిదర్శనం. అడవే ఆలయం.. వనదేవతలే ప్రాణాధారం అంటూ అక్కడి గిరిజనులు బ్రతుకుతున్నారు. ఆదివాసీల విశ్వాసం ప్రకారం అడవి ఉంటేనే దేవతలు ఉంటారు. ఆదివాసీ సంప్రదాయాలకు, ఆధునిక వసతులు తోడై ఇప్పుడు కోట్లాది భక్తుల కొంగుబంగారంగా మారింది. మేడారంలో మనకు కనిపించే చిలుకల గుట్ట, జంపన్న వాగు, వెదురు పొదలు, ఇప్ప చెట్లే ఇక్కడి ఆలయ నిర్మాణాలు. మేడారం అడవులు ఎన్నో రకాల అరుదైన ఔషధ వృక్షాలకు నిలయం. వనదేవతల స్వరూపం ప్రకృతిలో ఉందనే భావనతో, ఈ జాతరను పర్యావరణ హితంగా జరుపుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీల విశ్వాసం ప్రకారం అడవిని నాశనం చేస్తే దేవతలు సహించరు అనే భావన ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మ దేవతలు అరణ్యాల్లో నివసించే వన దేవతలు గద్దలు కూడా అవి మధ్యలోనే ఉన్నాయి.నేడు కోట్ల మంది భక్తులతో, ఆధునిక వసతులతో కళకళలాడుతున్న మేడారం.. 1970లలో పూర్తిగా భిన్నంగా ఉండేది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం మేడారం జాతర ఎలా జరిగిందో ఊహించుకుంటేనే మనము ఆశ్చర్యానికి లోనవుతాము. అప్పట్లో జంపన్న వాగులో ఎడ్లబండ్ల ప్రయాణాలు, గిరిజనుల సంప్రదాయ పూనకాలు పల్లెటూరి స్వచ్ఛతను ప్రతిబింబించేవి ఇంకా చూడడానికి ఎంతో ఆకర్షణీయమైన ఫోటోలు దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు నాటి జాతర వైభవాన్ని మన కళ్లముందు ఉంచుతున్నాయి. దేవాదాయ శాఖ భద్రపరిచిన ఈ ఫోటోలు గనక మనం చూస్తే, కాలక్రమేణా జాతర ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది.కాలం మారుతున్నా, ఆధునికత తోడవుతున్నా.. మేడారం జాతర తన మూలాలను ఎన్నడు కోల్పోలేదు. అడవిని కాపాడుకుంటూ, ప్రకృతిని ఆరాధించే ఈ ‘మహా కుంభమేళా’ ఆదివాసీ సంస్కృతికి ఒక అమూల్యమైనదిగా చెప్పుకోవచ్చు.అప్పటి ఫోటోలను కనుక మనం చూసినట్లయితే అప్పటికి, ఇప్పటికీ కాలంతో పాటు జాతర ఏర్పాట్లు కూడా ఎంతోగానో మారిపోయాయని మనం చూడవచ్చు.

…………………………………………………..
