*మేడారం వన దేవతల గద్దెలపై చలవ పందిర్లు ఏర్పాటు చేయాలి
*పెండింగ్ ఆలయ అభివృద్ధి పనులలో వేగం పెంచాలి
*జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు:
ఆదివాసీల ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని, పెండింగ్ ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అంగన్వాడి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ 99 రోజుల ప్రజా ప్రణాళిక ప్రగతి పాలన లో భాగంగా ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూరు హ్యాబిటేషన్ లో జరుగుతున్న పారిశుధ్య పనులను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలపై చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని, ఆలయ రేయిలింగ్ ఫ్లోరింగ్ పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఊరట్టం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. వివిధ దశలలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండగ వరకు గృహ ప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచనలు చేశారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పిల్లలకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేసే పాల ప్యాకెట్ పై ఉండే ముద్రణ తేదీలను గమనిస్తూ గడువు దాటిన వాటిని గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
పిల్లల ఎత్తు, బరువులను తరచు పరిశీలిస్తూ రక్తహీనతతో ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలు శుభ్రంగా ఉండాలని, పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రీ-స్కూల్ బోధన లో భాగంగా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయాలని, పిల్లలు ఉత్సాహంగా ఉండేలా వాతావరణాన్ని కల్పించాలని, టీచర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరస్వామి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీధర్, ఆర్ అండ్ బి డి ఈ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు రోహిణి, ఊరట్టం గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం శైలజ, వెంకటేష్ నాగమణి ప్రజాప్రతినిధులు, మేడారం ఆలయ గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
