ఆకేరు న్యూస్, హన్మకొండ: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హన్మకొండ, ములుగులో వ్యాపారులు నాసిరకం ఆహార పదార్థాలు అమ్ముతూ, అధిక ధరలతో సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారు . చిప్స్, పల్లిపట్టీలు వంటి ప్యాక్ చేసిన వస్తువులను అమ్ముతు, ప్రతి వస్తువుపై ఉన్న MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు. మేడారం జాతర సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు దందా చేస్తున్నారు.. ఆర్టీసీ అధికారులు గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు గానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రశ్నించిన ప్రయాణికులపై వ్యాపారులు ఎదురు దాడికి దిగుతూ, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎక్కువ ధరలు విక్రయించే చోట ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
………………………………………..
