* మూడు రోజుల పాటు తల్లులకు ప్రత్యేక పూజలు
* నేడు సారలమ్మ.. రేపు సమ్మక్క
* గద్దెలపై కొలువుదీరనున్న వనదేవతలు
* భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ఆకేరున్యూస్, మేడారం: మేడారం అడవిలో అద్బుతఘట్టం ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి వనదేవతల మహాజాతర ప్రారంభం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా మేడారం మహాజాతర కీర్తిని చాటేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి భక్తులు తరలి రాబోతున్నారు. మహా జాతరకు 2నుంచి 3 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాది మంది భక్తులు నెల రోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ప్రభుత్వం, అధికారులు నిమగ్నమయ్యారు.
కుంభమేళాగా మేడారం జాతర..
దక్షిణ భారతదేశ కుంభమేళాగా చెప్పుకునే సమ్మక్క-సారక్క జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో ఇప్పుడు నవ మేడారంగా మారింది. మేడారం జాతర తీరుతెన్నులు 2026 ఏడాదికి ముందు..ఆ తర్వాత అంటూ కోట్లాదిమంది భక్తులు మాట్లాడుకునే స్థాయికి మారింది. సమ్మక్కసారక్క గద్దెల చుట్టూరా భారీ తెల్లని పాలరాయి శిల్పాలు అక్కడికొచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాయి. వాటిపై తల్లుల చరిత్ర, కోయ వంశీకుల ఇష్టదైవ జంతువులు, చెట్లు, సంప్రదాయాలు, గొట్టుగోత్రాలు, జీవనశైలీ తెలిపే చిహ్నాలు భక్తుల శిలలవైపే కన్ను అర్పకుండా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. గద్దెల ప్రాంత విస్తరణను మరో మూడంతలు పెంచడమే కాకుండా కోయల సంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో భక్తులు ప్రధాన ద్వారం గుండా గద్దెల ప్రాంతానికి అడుగుపెట్టిన మొదలు మొక్కులు చెల్లించే వరకు మనసులో తల్లుల జపం.. కళ్లరా అక్కడి సంప్రదాయ శిల్పసౌందర్యాన్ని చూసేలా నవ మేడారం కనిపిస్తోంది.
నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ
నేడు సమ్మక్క బిడ్డ సారలమ్మను కన్నెపల్లి నుంచి పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకొచ్చి మేడారంలోని గద్దెపైకి చేర్చుతారు. మహాజాతరలో తొలిరోజు ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
చిలుకల గుట్ట నుంచి సమ్మక్క
రేపు మేడారం మహాజాతర అతి ప్రధానమైన ఘట్టం ఉంటుంది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తల్లుల రాకకు గుర్తుగా.. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి సమ్మక్కను వస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తారు. దీంతో మేడారం ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోతుంది. పూనకాలు.. ఎదురుకోళ్లు జంతుబలులతో మహాఘట్టం ఆవిష్కృతమవుతుంది.
మూడు రోజులు మొక్కులు
నేడు సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెలపై కొలువు తీరగా భక్తులు మూడు రోజులపాటు మొక్కులు చెల్లిస్తారు. మొక్కుల తర్వాత దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కాగా.. జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.
……………………………………………………………………..
