* ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం పెరిగిన అంచనాలు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ :
తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు మెగాస్టార్. ప్రస్తుతం యువ హీరోలు ఎందరు వచ్చినా, డ్యాన్స్ ల్లో దుమ్ము లేపుతున్నా.. ఆ గ్రేసు.. మాసు.. ఒక్కరికే సొంతమని ఆయన గుర్తింపు పొందారు. చాలా మంది యువ హీరోలు కూడా ఆయనే మా బాస్ అని చెబుతుంటారు. ఇప్పుడు ఆ మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గా సందడి చేసేందుకు సంక్రాంతికి వస్తున్నారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. జనవరి 12న గ్రాండ్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ సక్సెస్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
సాంగ్స్.. టీజర్స్.. ట్రైలర్..
గత సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 300 కోట్లకుపైగా వసూళ్లతో సంచలన రికార్డు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వహించిన F2: Fun and Frustration, దాని సీక్వెల్ F3: Fun and Frustration కూడా తెలుగులో అతి పెద్ద విజయాలను నమోదు చేసుకున్నాయి. సంక్రాంతి సినిమాల సక్సెస్ తో దూసుకెళ్తున్న అనిల్.. ఆయా సినిమాల తర్వాత చిరంజీవితో సినిమా అని ప్రకటించగానే ఆసక్తిని పెంచింది. మన శంకర వర ప్రసాద్ గారు అంటూ చిరంజీవి అసలు పేరునే టైటిల్ గా పెట్టి ఆకట్టుకున్నారు. ఇగ షూటింగ్ ప్రారంభం నుంచి.. ముగింపు వరకూ అంచనాలను పెంచుతూనే ఉంది. ఈ సినిమా సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా డ్యాన్స్.. మాస్ లుక్..
ఇక ఈ సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన సాంగ్ అభిమానులను ఉర్రూతలూపింది. మాస్ లుక్ తో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఏ పార్టీకొచ్చి పర్లేదంటూ నువ్ పక్కన్నిలబడితే ఏం లాభం అంటూ.. తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అలనాటి చిరంజీవిని మళ్లీ గుర్తు చేశారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఏం గ్రేస్ బాసూ తెగపొగిడేస్తున్నారు. 12వ తేదీన థియేటర్లలో బాక్స్ బద్దలుకావడం ఖాయమని అంటున్నారు. మరి మన శంకర వర ప్రసాద్ ఎలా మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.
……………………………………….

