Telangana Midnight Rain Havoc
ఆకేరు న్యూస్, డెస్క్: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో (Heatwave) అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు అర్ధరాత్రి వేళ వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఉపశమనం కలిగించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు బంద్ చేసి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ అకాల వర్షం ఎండల నుంచి ఊరటనిచ్చినప్పటికీ.. చేతికొచ్చిన పంటను మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన రైతన్నలకు మాత్రం తీరని శోకాన్ని మిగిల్చింది. పలుచోట్ల ధాన్యం, మక్కల కుప్పలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
*ఒక్కసారిగా మారిన వాతావరణం..
రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలైన లంగర్‌హౌస్, గోల్కొండ, రాందేవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి గట్టిగా వాన పడింది. నిన్నటివరకు 42 డిగ్రీలకు పైగా ఉన్న ఉష్ణోగ్రతలు నేటి ఉదయానికి ఏకంగా 23 డిగ్రీలకు పడిపోవడం విశేషం. దీంతో నగరవాసులు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
*జిల్లాల వారీగా నమోదైన రికార్డు వర్షపాతం..
రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట మరియు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అధికారిక గణాంకాల ప్రకారం వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి…
సిద్దిపేట జిల్లా: ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అంగడ కిష్టాపూర్‌లో 6.5 సెం.మీ వర్షం పడింది. దుబ్బాక ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లా: భూత్పూర్ మండలంలో రికార్డు స్థాయిలో 11.2 సెం.మీ (112 mm) వర్షం కురిసింది. కొత్తమొల్గరలో 11 సెం.మీ, పర్పల్లిలో 10 సెం.మీ, మహబూబ్‌నగర్ టౌన్లో 7.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
నాగర్‌కర్నూల్ జిల్లా: తిమ్మాజీపేటలో 8.4 నుంచి 8.8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
వనపర్తి జిల్లా: అమరచింతలో 8.6 సెం.మీ వర్షపాతం రికార్డైంది.
నల్గొండ జిల్లా: గుండ్లపల్లి మరియు డిండి పరిసర ప్రాంతాల్లో 6.2 సెం.మీ వర్షం పడింది.
ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి: పెద్దపల్లి మార్కెట్ యార్డులో తూకానికి సిద్ధంగా ఉన్న వేలాది క్వింటాళ్ల మక్కల బస్తాల్లోకి వర్షపునీరు చేరి కొట్టుకుపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో సుమారు 4 వేల క్వింటాళ్ల మక్కలు, 6 వేల క్వింటాళ్ల ధాన్యం నీట మునిగింది. కరీంనగర్‌లోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
*కల్లాల్లోనే కొట్టుకుపోయిన వడ్లు.. రైతుల ఆవేదన..
ఈదురుగాలుల బీభత్సానికి ఉమ్మడి కరీంనగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చొప్పదండి పరిధిలోని పెంచాలపల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో రాత్రంతా సరఫరా నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోవడంతో కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం, మక్కలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
