* 4 రోజులపాటు జాతర సంబురాలు
* ఏర్పాట్లుచేసిన అధికారులు
ఆకేరున్యూస్, వరంగల్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు మినీ మేడార జాతర జరగనుంది. బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. అంటే జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగె, మండ మెలిగె పండుగను నిర్వహిస్తుంటారు. ఈ నెల 12న జాతర ప్రారంభం కానుండటంతో పూజారులు బుధవారం గుడి మెలిగె పండుగకు శ్రీకారం చుట్టారు. బుధవారం మేడారంలో గల సమక్క ఆలయంలో సిద్ధబోయిన వంశస్థులు, కన్నెపల్లలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడి మెలిగె పండుగను నిర్వహించారు. ఈ గుడి మెలిగె పండుగలో భాగంగా పూజారులు గుడిని శుద్ధి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలతో అటవీప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగె, గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు వెల్లడిరచారు. ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజలతో పాటు రాత్రివేళ్లల్లో డోలీలతో కొలుపును నిర్వహిస్తారు. అదే విధంగా కొండాయిలో గోవిందరాజులు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని మండమెలిగె పండుగను నిర్వహించారు. అలాగే పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలోని మినీ మేడారం జాతరకు రూ.32 కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
……………………………………