* మధ్యాహ్నా భోజన మెనూలో చేపల కూర
ఆకేరున్యూస్, కరీంనగర్ : మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురుకుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మటన్, చికెన్ పెడుతున్నామని.. ఇప్పటి నుంచి చేపలు మెనూలో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో చేపలు కూడా ఉండాలని తన దృష్టికి మంత్రి శ్రీహరి తీసుకువచ్చారని గుర్తు చేశారు. మంత్రి శ్రీహరి ఆకాంక్షలకు అనుగుణంగా గురుకుల మధ్యాహ్న భోజన మెనూలో చేపలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి ఉన్నాయని వివరించారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు పెంచి గణనీయంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. గుర్తింపు పొందిన మత్స్యకారులకు కోటి40 లక్షలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో హాస్టల్స్‌లో ఉండే మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
…………………………………………………………………..
