* సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా
* రూ. 2 లక్షల వరకు అప్పు భీమా
* అన్ని ప్రధాన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు
– మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
మహిళలు బ్యాంకులు ఇచ్చే ఋణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ( Telangana Minister Seethakka ) అన్నారు. శనివారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్ హెచ్ జీ – బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రూ. 20,000.39 కోట్లు 3,56, 273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు.
మహిళా శక్తి క్యాంటీన్లు
మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాల క్రింద 2,53,864.సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబర్ 2023 నుండి మార్చి, 2024 వరకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేశాం. సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా మరియు రూ. 2 లక్షల వరకు అప్పు భీమా కల్పిస్తున్నాం .. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని కూడా మహిళా సంఘాలకే అప్పగించాం. దీని ద్వారా సంఘాల్లో ఉన్న మహిళలకు రూ. 50 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని సీతక్క అన్నారు. సెక్రటేరియట్, జిల్లా కలెక్టరేట్ కా ర్యాలయాల్లో , పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు , పారిశ్రామిక ప్రాంతాలు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన కార్యాలయాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేశామన్నారు . ఈ విధంగా మహిళా సంఘాలలోని మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు . . వారు చేసే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసుకునేటందుకు వ్యక్తిగత ఋణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామన్నారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో మహిళలకు శిక్షణ
మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆ దిశగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ. 20,000 కోట్లకు అధనంగా 2,25, 000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. . అంతేకాకుండా గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమలో మరియు ఇతర వృత్తులలో తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు. బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు .
త్వరలో మహాలక్ష్మీ పథకం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం , ప్రతి కుటుంబానికి రూ. 500 లకే సిలిండర్ మరియు 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు . ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం , రూ. 5 లక్షలు మరియు మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి నెల రూ. 2,500/- త్వరలో ప్రారభిస్తామని అన్నారు.రాబోయే 5 సంవత్సరాలలో బ్యాంక్ ల ద్వారా మహిళా శక్తి పథకం క్రింద లక్ష కోట్ల ఋణాలు వివిధ ఆర్థిక కార్యక్రమాల కొరకు మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్ హెచ్ జీ ఋణాల మంజూరీ లక్ష్యాన్ని గత సంవత్సరం లాగా అధిగమిస్తారని ఆశిస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. . ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, CGM – NABARD సుశీల చింతల, CGM – SBI, DGM – RBI, CEO – SERP, SERP – Directors, DRDOs, SERP Officers, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి అధికారులు మరియు వివిధ జిల్లాల నుండి సమావేశానికి హాజరైన మహిళా సంఘాల ప్రతినిధులు/సభ్యులు ఈ సమా వేశంలో పాల్గొన్నారు.
———————-