Sonam Wangchuk Hunger Strike
* నేడు దేశవ్యాప్తంగా సామూహిక ఉపవాసాలు
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న విద్యార్థుల, నిరసనకారుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. నీట్ (NEET) పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు గురువారానికి మరింత తీవ్రమయ్యాయి. ప్రముఖ విద్యా సంస్కర్త, సామాజిక విప్లవకారుడు సోనం వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 19వ రోజుకు చేరుకుంది.
* క్షీణిస్తున్న సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం..
గత 19 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష కొనసాగిస్తున్న సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆయన ఇప్పటికే దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం 57 కిలోల బరువుకు చేరుకున్న వాంగ్ చుక్ తీవ్ర నీరసంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని, జూలై 20న నిర్వహించ తలపెట్టిన “చలో పార్లమెంట్” మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
* దేశవ్యాప్తంగా సామూహిక దీక్షలకు సీజేపీ పిలుపు
సోనం వాంగ్ చుక్ దీక్షకు సంఘీభావంగా మరియు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేడు దేశవ్యాప్త సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, మేధావులు, రాజకీయ నేతలు మరియు సాధారణ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నాయకులతో పాటు పలువురు విద్యార్థులు కూడా వాంగ్ చుక్కు మద్దతుగా సమాంతర దీక్షలు కొనసాగిస్తున్నారు.
* దిగొరాని కేంద్రం, పెరుగుతున్న మద్దతు…
గత కొన్ని రోజులుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాకరే, అర్వింద్ కేజ్రీవాల్, శశి థరూర్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు నసీరుద్దీన్ షా, జీనత్ అమన్, అరుంధతీ రాయ్ వంటి సినీ, సామాజిక ప్రముఖులు సోనం వాంగ్ చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను దీక్ష విరమించాలని కోరుతూనే, కేంద్ర ప్రభుత్వం వెంటనే నిరసనకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు మరియు దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత వచ్చే వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
