* రాష్ట్ర మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: పర్యాటకులు ఎక్కడికో వెళ్ళి పర్యటించి పట్టణ ప్రాంతాల్లో కలుషిత వాతావరణంలో గడిపే బదులు, ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం లో పచ్చని అడవి అందాల పర్యాటక ప్రదేశం లో కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యవంతమైన పర్యటన చేసుకునే విధంగా ములుగు జిల్లా స్వాగతం పలుకుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్ ను సీతక్క ప్రారంబించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాల ప్రజలు వస్తు వెళుతున్నారు. గత సంవత్సరం పస్రా తాడ్వాయి మద్యలో జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ప్రారంభించామని, ఇటీవలే తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ కూడా అడవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అదే విధంగా ఈ రోజు జలగలంచ వద్ద అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా మన అడవి అందాలు ఉంటాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు సరదాగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాల నిలయం ఆల్లాదంగా ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ అని, చిన్నా పెద్దా అందరూ కలిసి పతంగులు ఎగురవేస్తూ ఆనందాన్ని పంచుకుంటారని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే పండుగ వేళ చైనీస్ మాంజా దారాల వాడకం వల్ల ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులకే కాకుండా పక్షులకు కూడా చైనీస్ మాంజా దారాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా చైనీస్ మాంజా దారాలను వాడకూడదని, స్వచ్ఛందంగా వాటిని పూర్తిగా నిషేధించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సురక్షితమైన పతంగి దారాలను మాత్రమే వినియోగిస్తూ, పండుగను ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి, పండుగ సంతోషాన్ని అందరూ సురక్షితంగా అనుభవించగలమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, డి ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అడవి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………………………………….

