
* మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ కానున్న పొన్నం, అడ్లూరి
* రంగంలోకి దిగిన మీనాక్షి నటరాజన్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ల పంచాయతీ
చివరికి పీసీసీ వద్దకు చేరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 5న ఈనెల 5న జరిగిన ఓ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలో అడ్లూరిని ఉద్దేశించి పొన్నం పలు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండటంతో ఆవి కాస్తా బహిర్గతమయ్యాయి. దీంతో మనస్థాపానికి గురైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్న ప్రభాకర్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. మంత్రి పొన్నం బే షరతుగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నం చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న మంత్రి పొన్నం ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. దళిత సంఘాల పిలుపు మేరకు మంత్రి పొన్నం ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల మధ్య వివాదంపై ఆరా తీశారు. ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదేశించారు. దీంతో ఇద్దరు మంత్రులను పీసీసీ చీఫ్ తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు. ఇద్దరు మంత్రులు కాసేపట్లో పీసీసీ చీఫ్ ఇంటికి వెళ్లనున్నారు. ఇది తమ ఇంటి సమస్య అని ఈ సమస్యను భూతద్దంలో చూసే అవసరం లేదని తమ పార్టీ అంతర్గత వ్యవహారమని నిన్న మీడియాతో పీసీసీ చీఫ్ అన్న విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో ఈ వివాదానికి కాసేపట్లో శుభం కార్డు పడనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
…………………………………….