* 52 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
* ఆరోగ్యానికి మేలు.. గిరిజనులకు ఆదాయం
* ‘ఇప్ప’ సాగుపై అసెంబ్లీలో హీట్!
* బ్రిటిష్ కాలం నాటి ఆంక్షలు వీడాలి..
* ‘ఇప్ప’ ఉత్పత్తులను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ‘ఇప్ప పువ్వు’ (Mahua Flower) అంశం రాజకీయంగా, సామాజికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప పువ్వు ఉత్పత్తులు కేవలం మద్యం తయారీకే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం పెద్ద చర్చకు దారితీసింది.
* 10 లక్షల ఇప్ప చెట్ల లక్ష్యం:
పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంకల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ లేఖకు ఇప్పటికే 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం.
* ఇప్ప చెట్ల ప్రాముఖ్యత:
ఇప్ప చెట్లు కరువును తట్టుకోగలవు. ఇవి భూక్షయాన్ని అరికట్టి నేల సారవంతాన్ని పెంచుతాయి. తెలంగాణ వంటి అర్ధ-శుష్క ప్రాంతాలకు ఇవి ఎంతో అనుకూలం. ఇప్ప పువ్వులు, గింజలు గిరిజనులకు, గ్రామీణ ప్రజలకు ప్రధాన ఆదాయ వనరులు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీటి ద్వారా వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్ప పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో ఐస్క్రీమ్, కేకులు, లడ్డూలు, బిస్కెట్లు వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను తయారు చేయవచ్చని అనిరుధ్ రెడ్డి వివరించారు. బ్రిటిష్ కాలం నాటి పాత నిబంధనలను పక్కన పెట్టి, ఆధునిక పద్ధతుల్లో ఇప్ప ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి ఆదాయంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.
