* మరొకరు దాన్ని అమలు చేశారు
… ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
దళితుల సమగ్ర అభివృద్ధికి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ లు రెండు కళ్ళలాంటి వారిని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల సమగ్రాభివృద్ధికి డాక్టర్ బీఆర్. అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ రెండు కళ్ళ లాంటి వారని కొనియాడారు. అంబెడ్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం రచిస్తే, ఆ రాజ్యాంగ ఫలాలు అందడానికి అవి అమలయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. తన జీవిత కాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేశారన్నారు.
దేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దళితుల పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేక పోతున్నారని వారి కోసం ప్రత్యేక హాస్టల్స్ ప్రవేశ పెట్టాలని అలోచించి దేశవ్యాప్తంగా సోషల్ వెల్ఫెర్ హాస్టల్లను తీసుకువచ్చారని అన్నారు. ఈ హాస్టల్స్ లో చదువుతున్న దళిత బిడ్డలు ఎందరో అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని తెలిపారు. అలాగే దేశంలో నిరుపేద ప్రజల ఆకలి తీర్చేందుకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి చేయాలని ఆలోచన చేసిన గొప్ప మహనీయుడని వెల్లడించారు. దళితులు పరిపాలన చేయలేరు అని ఆలోచనలు కలిగిన సమాజంలో అవకాశం ఇస్తే దళితులు ఏదైనా చేయగలరు అని మంత్రిగా ఏ శాఖ ఇచ్చిన సమర్థవంతంగా పని చేసి నిరూపించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. అలాంటి మహనీయుని జయంతి వేడుకలను ప్రతీ ఒక్కరూ జరుపుకోవాలని సూచించారు. ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలు పాటుపడాలని ఆకాంక్షించారు. తనకు సోషల్ వెల్ఫెర్ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒకేసారి 100 గురుకుల పాఠశాలలను ప్రారంభించానని అలాగే అప్పటికే ఉన్న గురుకులాలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేశానని ఎమ్మెల్యే వివరించారు. 2016లో అంబేద్కర్ గారి 125జయంతి సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎం చేద్దామని అడిగినప్పుడు 125 గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పి 125ఎస్సి గురుకులాలు ఏర్పాటు చేయించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం శిథిలావస్థలో ఉందని దాని స్థానంలో వచ్చే ఏప్రిల్ 05 2027 నాటికి కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ల పేరు మీద 2 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తానని చెప్పారు. 2004 నుండి 2023 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎం చేశారో మీ అందరికీ తెలుసని, చిల్లర మాటలు, చిలిపి చేష్టలతో నియోజకవర్గ పరువు తీసారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అలాంటి వారి మాటలు నేను పట్టించుకోనని తెలిపారు. జగ్జీవన్ రామ్ సూచించిన మార్గంలో నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా, మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకునే విధంగానే నా పని తీరు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్డీవో డి ఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య, చైర్మన్ ఐలయ్య, కౌన్సిలర్లు లక్ష్మి, స్వరూప, హైమ, రజిత, రమ్య, సంపత్ రాజ్, రాజేష్, అనిల్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ, తాసిల్దార్ స్వప్న నాయకులు బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, బెల్దే వెంకన్న, నీల గట్టయ్య, గన్ను నరసింహులు, గట్టు చేరాలు, జోగు కుమారస్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.
* ” తాటికొండలో…
స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండలో బాబు జగ్జీవన్ రావ్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు మారపాక నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారపాక సృజన శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడమ కట్టమల్లు, మాజీ జెడ్పిటిసి మారపాక రవి, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
* ” టిఆర్ఎస్ ఆధ్వర్యంలో….
మండల కేంద్రంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, ఒకటో వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు, మాజీ ఎంపీటీసీ కనకం గణేష్, ఇస్రం శీను, గూండా మల్లేష్, చల్ల రఘు, కౌన్సిలర్ అనిల్, అశోక్, చింత శ్రీను, సీను తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
