* స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి బడ్జెట్ ఆమోదం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ :
సమిష్టి కృషితో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ 2026 -27 బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్బంగా 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను పరిశీలించి బడ్జెట్ అంచనాలపై చర్చించారు. అనంతరం 63 కోట్ల 33 లక్షల 70వేల రూపాయల బడ్జెట్ అంచనాలకు మున్సిపాలిటీ పాలక వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే పట్టణ కేంద్రంలో మార్కెట్ ఏర్పాటుకు బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథ ఆలయ భూమిని లీజు, పట్టణ కేంద్రంలో పార్క్ అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు వక్ప్ బోర్డు అధీనంలో ఉన్న సుమారు 4 ఎకరాల భూమిని లీజుకు తీసుకునేందుకు తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపించేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలలో పన్నులు ఏవిధంగా అమలు చేస్తున్నారో సరిచూసుకోవాలని అన్నారు. సామాన్య, పేద ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చూడాలని తెలిపారు. ముందుగా వాణిజ్య, వ్యాపార పన్నులను రాబట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పన్నులు వసూలు అయితేనే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, ఇతర అభివృద్ధి పనులు చేయగలుగుతామని తెలిపారు. పన్నుల వసూలుపై అధికారులు, కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
