MLA Naini Rajender Reddy Hanamkonda Sports Hub
* క్రీడా రంగానికి కొత్త ఊపు..
* హనుమకొండలో ఆధునిక క్రీడా వసతులు ప్రారంభం
* ఆటలో గెలిచి.. హనుమకొండ పేరు ప్రపంచానికి చాటాలి
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
అకేరు న్యూస్,హనుమకొండ: విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ప్రధాన స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అభివృద్ధి చేసిన స్విమ్మింగ్ పూల్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ హనుమకొండ జేఎన్ఎస్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అన్నారు. గత రెండున్నరేళ్లలో వరంగల్, హనుమకొండ జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జేఎన్ఎస్లో కల్పించిన ఆధునిక క్రీడా సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

* స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవనం
స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ ప్రాంతం క్రీడాకారులకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిందని, గతంలో ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి దేశానికి గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. క్రీడల్లో సాధించే ప్రతి విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా కుటుంబం, గ్రామం, జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. తమ ప్రతిభతో హనుమకొండ జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రోజే ప్రజాప్రతినిధులు, అధికారులకు నిజమైన బహుమతి లభించినట్లవుతుందని పేర్కొన్నారు.
* క్రీడాకారులకు పూర్తి సహకారం
జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జేఎన్‌ఎస్‌లోని ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్‌లో క్రీడా వసతులను మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ సదుపాయాలను క్రీడాకారులు తమ సొంత ఆస్తిగా భావించి సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు కూడా సహకరించాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్‌కు ప్రత్యేక భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలకే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

* రూ. కోటిన్నరతో ఆధునిక వసతులు
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ దాదాపు రూ. కోటిన్నర వ్యయంతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్విమ్మింగ్ పూల్ ప్రారంభం అనంతరం స్పోర్ట్స్, స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారుల ప్రదర్శనను ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయి, ఏసీపీ జితేందర్ రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాడ్మింటన్ ఆడారు. బ్యాడ్మింటన్ వెటరన్ క్రీడాకారులు రమణయ్య, కైలాసంలను ఎమ్మెల్యే, కలెక్టర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కైలాస్ యాదవ్, ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ హనుమకొండ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
