Two dead in a neem tree dispute, suryapet
* కన్నతండ్రితో పాటు మరో వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
అకేరు న్యూస్, సూర్యాపేట: మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కనున్న వేపచెట్టును కొట్టివేసిన విషయంపై తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది.
* పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎర్రగట్టుతండాకు చెందిన మంద వెంకటేశ్వర్లు యాదవ్ ఇంటి పక్కనున్న వేపచెట్టును కొట్టివేయడంతో భూక్య రామ్ నాయక్తో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రామ్ నాయక్ గొడ్డలితో వెంకటేశ్వర్లు యాదవ్పై దాడి చేసి నరికి చంపినట్లు సమాచారం. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రామ్ నాయక్ కన్నతండ్రి సైదాపై కూడా అతడు గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన సైదా మృతి చెందాడు. అనంతరం తండ్రి హత్యకు వెంకటేశ్వర్లు యాదవ్ కారణమని నిందిస్తూ, అతడిని అందుకే చంపినట్లు రామ్ నాయక్ నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విషయం గ్రామంలో తెలియడంతో వెంకటేశ్వర్లు యాదవ్ వర్గీయులు ఆగ్రహానికి గురై రామ్ నాయక్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్సై నవీన్ గాయపడినట్లు సమాచారం.

రామ్ నాయక్ గ్రామంలోని పలువురితో తరచూ వివాదాలు పెట్టుకునేవాడని, గ్రామస్థులపై ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. గ్రామంలోని అధికశాతం మందితో అతడికి వివాదాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఘటన అనంతరం రామ్ నాయక్తో పాటు అతని అన్న, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పికెటింగ్ కొనసాగిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
