* ప్రభుత్వం ప్రజల పక్షమా.. పెద్ద డిఫాల్టర్ల పక్షమా
* ప్రమోటర్లు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు
ఆకేరు న్యూస్, హనుమకొండ : IBC కోడ్ (సవరణ) బిల్లు–2025 ప్రజల ప్రయోజనాలను కాపాడేలా లేదు.. కంపెనీలకు క్రమశిక్షణ తీసుకువచ్చి బ్యాంకుల డబ్బు కాపాడాలని ఉద్దేశంతో 2016లో IBC చట్టం తీసుకువచ్చారు.. ఇప్పుడు చూస్తే ఆలస్యాలు పెరిగాయి.. భారీగా హెయిర్‌కట్స్ ఇస్తున్నారు.. ప్రమోటర్లు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు.. ప్రజల డబ్బుకు రక్షణ ఎక్కడ ఉందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. క్లాజ్ 4లో 14 రోజుల టైమ్‌లైన్ పెట్టినా, NCLT, NCLATల్లో ఖాళీలు, కేసుల భారం ఉన్న పరిస్థితిలో అది ఎలా సాధ్యం అవుతుందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. “సామర్థ్యం లేకుండా డెడ్లైన్లు పెడితే ప్రయోజనం ఏమిటి అని నిలదీశారు. మోసాలకు సంబంధించిన నిర్వచనాలు చేర్చినంత మాత్రాన సరిపోదు.. వాటిపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థ కనిపించడం లేదన్నారు. కంపెనీలను దెబ్బతీసినవారు బయటకు వెళ్తున్నారు బ్యాంకులు నష్టపోతున్నాయి.. చివరకు ప్రజల డబ్బే పోతున్నది.. అని ఆందోళన వ్యక్తం చేశారు.
* పార్లమెంట్‌ను పక్కన పెట్టడమే..
క్లాజ్ 42లో ముఖ్యమైన అంశాలను చట్టంలో పెట్టకుండా నోటిఫికేషన్లకు వదిలేయడం సరైంది కాదని, ఇది పార్లమెంట్‌ను పక్కన పెట్టడమేనని విమర్శించారు. అలాగే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అధికారాలను పెంచడం వల్ల ప్రజా ప్రయోజనాల కంటే ఒప్పందాలకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రిజల్యూషన్ ప్లాన్ తుది స్థితి పొందిన తర్వాత కార్మికుల బకాయిలు, చిన్న క్రెడిటర్ల క్లెయిమ్‌లు ఏమవుతాయో స్పష్టత లేదని చెప్పారు.
* బిల్లు పరిశీలనకు పంపాలి..
ఒక కంపెనీ డిఫాల్ట్ అంటే అది కేవలం లెక్కల్లో విషయం కాదు. అది ప్రజల పొదుపు, రైతుల డబ్బు అని ఎంపీ కావ్య పేర్కొన్నారు. ఈ బిల్లు ఆ సమస్యలకు పరిష్కారం చూపడం లేదని, కాబట్టి దీనిని తిరిగి పరిశీలనకు పంపాలని లోక్‌సభను కోరారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందా లేక పెద్ద డిఫాల్టర్ల పక్షాన ఉందా అన్నది దేశం గమనిస్తోందని అన్నారు.
