MP Dr. Kadiyam Kavya Women Empowerment Rise Her
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన “రైజ్ హర్–2026” మహిళా సాధికారత సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* ‘పే బ్యాక్ టు సొసైటీ’ని అలవర్చుకోవాలి..
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. మహిళలు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో (పాజిటివ్ ఎనర్జీ) జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్ టు సొసైటీ’ (సమాజానికి తిరిగి ఇవ్వడం) అనే భావనను అలవర్చుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ, జాతీయ గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
* మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అవసరం..
అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను (Self Help Groups) మరింత బలోపేతం చేస్తోందని, మహిళల్లో పొదుపు పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధిని విస్తృతంగా ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.
* ఎస్సీ మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావాలి..
ప్రతి ఒక్కరూ జీవితాంతం నిత్య విద్యార్థులుగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని కడియం కావ్య ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎస్సీ మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం మరియు నాయకత్వ రంగాలలో మరింత ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటుకుంటూ, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కుటుంబంతో పాటు సమాజం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
* హాజరైన ముఖ్య అతిథులు..
ఈ సదస్సులో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఇండస్ట్రియల్ కామర్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, PMEGP ప్రతినిధి రవి, ఎస్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మూర్తి, వి-హబ్ డైరెక్టర్ జావేద్ అక్తర్ షేక్, TSICC ప్రెసిడెంట్ నల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
