Medaram Boy Car Accident
ఆకేరు న్యూస్, ములుగు:
ఒక తండ్రి చేసిన చిన్న నిర్లక్ష్యం.. మరొక కుటుంబంలో ఎన్నటికీ తీరని ఘోర శోకాన్ని మిగిల్చింది. నాలుగున్నరేళ్ల చిన్నారి చేతికి కారు తాళాలు ఇవ్వడం ఒక పసిప్రాణం బలి కావడానికి కారణమైంది. వనదేవతలను దర్శించుకుని సంతోషంగా గడపాల్సిన చోట.. అప్పటివరకు ఆడుకుంటూ కళ్లముందే తిరిగిన కన్నకొడుకు కారు కింద నలిగిపోవడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చోటుచేసుకుంది.
దైవదర్శనానికి వచ్చి… హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం తన కుటుంబ సమేతంగా శుక్రవారం మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వచ్చారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం వారు మేడారంలోని ఒక అద్దె గదిలో బస చేశారు. కుటుంబ సభ్యులంతా లోపల వంట పనిలో నిమగ్నమవ్వగా.. పురుషోత్తం కుమారుడు కౌశిక్ (7) బయట ఆరుబయట ఆవరణలో ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో.. వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలానికి చెందిన అరుణ్ కుటుంబం కూడా వనదేవతల దర్శనార్థం మేడారం వచ్చి, అదే ప్రదేశంలోని పక్క గదిలోనే విడిది చేసింది.
* ఊహించని ప్రమాదం జరిగిందిలా..
సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అరుణ్ తన చేతిలో ఉన్న కారు తాళాలను తన నాలుగున్నరేళ్ల కుమారుడికి ఇచ్చాడు. ఆ చిన్నారి తాళాలు తీసుకుని కారులోకి వెళ్లి కూర్చుని, సరదాగా కారును స్టార్ట్ చేశాడు. అయితే అప్పటికే ఆ కారు గేర్‌లో ఉండిపోవడంతో, స్టార్ట్ చేసిన వెంటనే ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.
కారు వేగంగా ముందుకు దూసుకురావడంతో.. అక్కడ ఆరుబయట ఆడుకుంటున్న పురుషోత్తం కుమారుడు కౌశిక్ (7)పై నుంచి కారు దూసుకెళ్లి, పక్కనే ఉన్న గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కౌశిక్ అక్కడికక్కడే విగతజీవిగా పడిపోయాడు.
* కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారి కారు కిందపడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. సమాచారం అందుకున్న నార్లాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: పిల్లల చేతికి వాహనాల తాళాలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. వాహనదారులు, తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
