* జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
* ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.
ఆకేరు న్యూస్,ములుగు: మహిళలను విద్యావంతులుగా మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సావిత్రీ బాయి పూలేదని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.జిల్లావ్యాప్తంగా మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధ్యక్షతన సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మొదట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో భానోత్ రవిచందర్ మాట్లాడుతూ చదువుల తల్లి శ్రీమతి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ రోజుల్లో మహిళల పట్ల ఉన్న వివక్షతను సావిత్రి భాయి పూలే తొలగించారని, ఇంటి నుండి బయటికి కూడా రాలేని మహిళలను విద్యావంతులుగా మార్చి విద్యా రంగంలో మహిళల పాత్రను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.రేపటి తరం మహిళలలు విద్యా రంగంలో రాణించే విధంగా ఆదర్శప్రాయంగా ఉన్నారని ఆమెను స్పూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు . పలువురు మహిళలను ఘనంగా సత్కరించి సన్మానించారు.

………………………………………………..

