* ములుగు కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు
* ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క
Bathukamma Celebrations| ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్ ప్రాంగణం పూలవనాన్ని తలపించింది.
సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. సంప్రదాయ పాటలు, చప్పట్లతో కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మన పూర్వీకుల నుంచి అందిన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని సూచించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నారు. పసుపుతో గౌరమ్మను రూపొందించి పూజించడం వంటి ఆచారాల్లో సంప్రదాయంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా ఇమిడి ఉందని పేర్కొన్నారు. అందరూ కలిసి బతుకమ్మ ఆడిపాడటం వల్ల ఆనందంతో పాటు పరస్పర ఆత్మీయత, ఐక్యత పెరుగుతాయని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటూనే విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. కష్టపడి పనిచేసి సాధించిన ఫలితం ఎంతో సంతృప్తిని ఇస్తుందని, ప్రజల ముఖాల్లో సంతోషం నింపేలా సేవలందించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి ప్రత్యేకం
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని అన్నారు. తాను మహారాష్ట్రకు చెందినప్పటికీ తెలంగాణకు వచ్చిన తర్వాత బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేకతను తెలుసుకున్నానని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా కలిసి పాటలు పాడుతూ ఆడిపాడే దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుందన్నారు. మహిళా అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మరింత అంకితభావంతో సేవలందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
32 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
బతుకమ్మ సంబరాల అనంతరం మంత్రి సీతక్క కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ములుగు మండలానికి చెందిన 25 మంది, మల్లంపల్లి మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులు ఉన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, మహిళా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

