* లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
* అర్హులందరికీ విడతలవారీగా అవకాశం: మంత్రి సీతక్క
Indiramma Houses| ఆకేరు న్యూస్, ములుగు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రెండో విడత లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏడాది వారు తమ సొంతింట్లోనే బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
109 మంది లబ్ధిదారులకు లబ్ధి
గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మండల పరిధిలోని 13 గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.5.45 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
అర్హులందరికీ అవకాశం
సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను గుర్తించి వారికి నివాస సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని సీతక్క వివరించారు. ములుగు నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారు ఐదు వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. రెండో విడతలోనూ అర్హులైన వారికి అవకాశం కల్పిస్తున్నామని, ప్రస్తుత విడతలో ఇళ్లు మంజూరు కాని అర్హులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తదుపరి విడతల్లో వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
నిర్మాణం చేపట్టాకే బిల్లులు
లబ్ధిదారులు ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు. పునాది స్థాయి నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లుల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులు ప్రారంభ నిర్మాణ ఖర్చుల కోసం సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉపాధి పనులను విస్తరించాలి
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీతక్క తెలిపారు. పండుగ అనంతరం గ్రామాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టేలా సర్పంచులు చొరవ చూపాలని కోరారు. ఈ పనుల ద్వారా కూలీలకు ఆదాయం లభించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

