* ఎన్కౌంటర్ జరిగిన రాత్రే
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్
* ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఘటన
* ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్‌కు చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రివరకు కూడా రాకపోవడంతో సిబ్బంది వేచి ఉన్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం రిసార్ట్ సిబ్బంది వెళ్లి చూడగా రూంలో ఎస్ఐ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఫెరిడో సిబ్బంది విషయాన్ని వెంటనే వాజేడు పోలీసులకు తెలిపారు. కాగా, ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఆయన సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సై హరీష్ ఆత్మహత్యకు.. ఎన్‌కౌంటర్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి ఇద్దరు మావోయిస్టు కొరియర్లను హత్య చేయడం ఎస్ఐ హరీష్ పరిధిలోనే జరిగింది. తర్వాత ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అధికారులు ఎస్ఐకు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. విధుల్లో భాగంగానే ఇంటినుంచి బయటకు వచ్చిన హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
…………………………………………….