* ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదు
* ఉద్యోగాల ఊసే లేకుండా గత పదేళ్ల పాలన
* ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగాలు
* యువ వికాసం సభా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
* గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
ఆకేరున్యూస్, పెద్దపల్లి: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY) అన్నారు. పెద్దపల్లిలో బుధవారం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా యువ వికాసం ( YUVA VIKAASAM) సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ( CONGRESS GOVERNMENT) చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాల్స్‌ను సభ వద్ద ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లో ఆపరేషన్ గరుడ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, డీ.ఈ.ఈ.టి, ఏ.ఎల్.ఈ.ఏ.పి, టాస్క్, ఎన్.ఎస్.ఐ.సి, న్యాక్, టామ్ కామ్, యువజన క్రీడ శాఖ, సింగరేణి సంస్థ ద్వారా కూడా స్టాల్ ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి పరిశీలించారు. అలాగే రూ. 1024 కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందరో నిరుద్యోగులు పోరాటం చేసి సాధించుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అవకాశాలను నిరుద్యోగులకు చేరువ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని, అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువకుల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు.
యువకులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో, ఉద్యోగాల ఊసే లేకుండా పరిపాలించిందని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే యువకులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై ఎన్నో దుష్ప్రచారాలు సాగిస్తున్నారని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం వాటికి సమాధానమన్నారు. ఈ కార్యక్రమంలోనే గ్రూప్-4 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు యువ వికాసం సభా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదేళ్ల పాలనను.. ఏడాది పాలనను పోల్చి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం రేవంత్ కోరారు. ప్రతిపక్షాల చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న జిల్లా పెద్దపల్లి ..
రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న జిల్లా పెద్దపల్లి అని అన్నారు. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మోదీ సీఎం, పీఎంగా ఉంటూ గుజరాత్లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు. ఉద్యోగాలపై మాట్లాడాలని మోదీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. వడ్లు పండిరచమని చెప్పామని, అందుకే మద్దతు ధర, బోనస్ ఇస్తున్నామని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూశానని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని పేర్కొన్నారు. కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాతవాహన వర్సిటీకి ఇంజినీరింగ్, లా కాలేజీలు మంజూరు చేస్తామని ప్రకటించారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటి పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
………………………………