
* పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు
* పుట్టింటి వాళ్లతో కలిసి హత్య చేసిందని ఆరోపణ
*పిడుగురాళ్లలో హత్య చేసి శవాన్ని నూనెపల్లికి తీసుకొచ్చిన వైనం
ఆకేరు న్యూస్ డెస్క్ : తన తల్లే తన నాన్నను చంపింది అని ఓ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన నంద్యాల జిల్లా నూనెపల్లెలో చోటుచేసుకుంది. నంద్యాలలో పెయంటింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న రమణయ్యకు భార్య రమణమ్మ ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే రమణయ్య మరో యువతితో వివాహేతర సంబందం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య రమణమ్మ భర్తతో తరచూ గొడవ పడేది.ఈ నేపధ్యంలో రెండు నెలలక్రితం పుట్టిళ్లు అయిన పిడుగురాళ్లకు వెళ్లింది. తాను ఇంటికి తిరిగి వస్తానని తనను తీసుకెళ్లమని భర్త రమణయ్యకు రమణమ్మ ఇటీవల కబురు చేయడంతో రెండు రోజుల క్రితం రమణయ్య భార్యను తీసుకురావడానికి పిడుగురాళ్లకు వెళ్లాడు. అయితే మంగళ వారం రమణయ్య హత్యకు గురి అయ్యాడు. రమణయ్య మృత దేహాన్ని తన సోదరుడితో కలిసి నూనెపల్లికి తీసుకొచ్చింది రమణమ్మ. రమణయ్య సహజమరణం చెందాడని కూతుళ్లను నమ్మించే ప్రయత్నం చేసింది. మృత దేహంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన కూతురు జ్యోతి నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణయ్య కూతురు ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు మృతదేహాన్ని స్వాథీనం చేసుకొని నంద్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్య పిడుగురాళ్లలో జరుగడంతో నంద్యాల పోలీసులు పిడుగురాళ్ల పోలీసులకు సమాచారం అందించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
……………………………………………..