
* ప్రాజెక్టుకు చేరుతున్న ఎగువ వరద నీరు
* తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగుతున్నాయి. శ్రీశైలం, జూరాల, తుంగభద్ర, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ వరద ప్రవాహం పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 590 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయ రెండు గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రెండు గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి మట్టం పెరిగింది. దీంతో నేటి సాయంత్రం జలాశయ గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈరోజు కూడా తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
……………………………………….