Kondamallepally Principal Murder case solved
* కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ హత్య మిస్టరీ ఛేదన
ఆకేరు న్యూస్, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతినీ, సంచలనాన్ని సృష్టించిన నాగార్జున గ్రామార్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి (48) దారుణ హత్య కేసును నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టాల్సిన విద్యార్థులే, పాత కక్షలు మనసులో ఉంచుకుని, వ్యసనాలకు అలవాటుపడి కన్నతల్లి లాంటి గురువునే దారుణంగా అంతమొందించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
* నేరం జరిగిన ప్రాంతం..
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో ఉన్న ప్రిన్సిపల్ రూపారెడ్డి నివాసంలో ఈ ఘాతుకం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI), సబ్ ఇన్స్పెక్టర్ (SI)లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు నివసించే అత్యంత భద్రత కలిగిన కాలనీలోనే ఈ దారుణం జరగడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
* దారుణానికి తెగించారు..
పోలీసుల సమగ్ర దర్యాప్తులో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు.. నిందితులైన పాత విద్యార్థులు పాఠశాలలో చదివే రోజుల్లో తీవ్ర అల్లరి, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి వారిని తీవ్రంగా మందలించారు. ఆ పాత కక్షను మనసులో ఉంచుకుని ఆమెపై తీవ్రంగా పగ పెంచుకున్నారు. సదరు మైనర్లు గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. విలాసవంతమైన జీవితం గడపడానికి, ఈజీ మనీ కోసం రూపారెడ్డి ఇంట్లో ఉన్న భారీ నగదు, ఆభరణాలను దోచుకోవాలని పక్కా పథకం రచించారు.
* హత్య చేశారంటే..
ప్రిన్సిపల్ హైదరాబాద్ నుంచి ఒంటరిగా తిరిగి వచ్చి ఇంటి వద్ద ఉన్న సమయాన్ని గమనించి, సీసీ కెమెరాలకు చిక్కకుండా ముందస్తుగా రెక్కీ నిర్వహించారు. క్లూస్ టీమ్‌కు వేలిముద్రలు దొరకకుండా చేతులకు సర్జికల్ గ్లౌజులు ధరించి, ఇంటి వెనుక వైపు ఉన్న కిచెన్ తలుపుల గుండా లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి చొరబడిన హంతకులు రూపారెడ్డిపై పదునైన కత్తితో విచక్షణారహితంగా 27 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్, ఇంట్లోని నగదును ఎత్తుకెళ్లి జల్సాలు చేయడానికి నేరుగా గోవాకు పారిపోయారు.
* పోలీసులు కేసును చేదించారు ఇలా..
ఇంట్లో ఎలాంటి వేలిముద్రలు లభించకపోవడంతో నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బస్సు స్టేషన్లు, కాలనీ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో చదివిన పాత మరియు ప్రస్తుత 10వ తరగతికి చెందిన పలువురు విద్యార్థుల వివరాలు సేకరించి విచారించారు. సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన పాత విద్యార్థుల కదలికలు, కాల్ డేటా ఆధారంగా మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు.
సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన విద్యార్థులే విలాసాలకు, వ్యసనాలకు బానిసలై విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ప్రాణాలు తీసే స్థాయికి తెగించడం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. ఈ దారుణ ఘటన పాఠశాలల్లో క్రమశిక్షణతో పాటు, మైనర్లలో పెరుగుతున్న వ్యసనాలపై తల్లిదండ్రులు, పోలీసులు మరింత నిఘా ఉంచాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తుచేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
