Kalyana Lakshmi Scheme Protest
* కాంగ్రెస్ సర్కార్‌పై అరూరి రమేష్ ఫైర్
ఆకేరు న్యూస్, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక కొండంత అండగా నిలిచే “కళ్యాణ లక్ష్మి”, “షాదీ ముబారక్” పథకాలపై కోర్టు విధించిన స్టేను తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఆదేశాల గులాబీ దళం రోడ్డెక్కింది. నియోజకవర్గ పరిధిలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హాసన్ పర్తి, వరంగల్ మండలాల ఎమ్మార్వో (MRO) కార్యాలయాల ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆయా మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు (మెమొరాండం) సమర్పించారు.
* కోర్టు కౌంటర్ నిరసన – సంక్షేమానికి కాంగ్రెస్ గ్రహణం
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ… గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కులమతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల మహిళల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీరుగారుస్తోందని మండిపడ్డారు. కోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం తరఫున లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం వెనుక కాంగ్రెస్ రాజకీయ కుట్ర ఉందని, కావలనే పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని ఆరోపించారు. పేద వర్గాలకు చెందాల్సిన ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
* ఎన్నికల హామీలు ఏమైనాయి..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నెరవేర్చని హామీలపై నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తులం బంగారం ఎక్కడ? కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే రూ. 1,00,116 చెక్కుతో పాటు వాగ్దానం చేసిన తులం బంగారాన్ని తక్షణమే లబ్ధిదారులకు అందించాలి.
ప్రతి మహిళకు ఇస్తామన్న రూ. 2,500 నెలవారీ సహాయం వెంటనే ఖాతాల్లో జమ చేయాలి.
గ్యాస్ సబ్సిడీ & పెన్షన్: రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు ఆసరా పెన్షన్ మొత్తాన్ని రూ. 4,000కు పెంచాలి.
* ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తాం..
కేసీఆర్ హయాంలో ప్రజాదరణ పొందిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు వంటి అద్భుతమైన వైద్య-ఆరోగ్య పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి సంక్షేమ పథకాలను పునరుద్ధరించకపోతే, రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, గులాబీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
