* లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్ఈ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : లంచం కేసులో జీహెచ్ఎంసీ ఎస్ఈ చిన్నారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లి ఏసీబీ కోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ చిన్నారెడ్డి నిన్న ఏసీబీకి పట్టుబడ్డారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) పొద్దుటూరి చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి బుధవారం పట్టుబడ్డారు. అల్వాల్, కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్లలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, ఏడాది పాటు చెరువుల నిర్వహణకు వేర్వేరుగా పిలిచిన 3 పనులను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. జోనల్ కమిషనర్ ఆమోదానికి పంపాల్సిన రూ.1.40 కోట్ల విలువైన బిల్లుకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేయాలంటే తనకు రూ.40 లక్షలు లంచమివ్వాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పడంతో రూ.30 లక్షలకు ఒప్పుకున్నారు. మొదటి విడతలో రూ.15 లక్షలు ఇవ్వాలని చెప్పారు. కాంట్రాక్టర్‌కు తరఫు మనుషుల నుంచి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ ఆ సొమ్ము తీసుకుని చిన్నారెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిన్నారెడ్డి, ప్రవీణ్ కుమార్‌లను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది.
