* నాడు కార్పొరేషన్.. నేడు సర్కిల్గానూ గుర్తింపు కరువు
* ఫిర్యాదులు పరిగణనలోకి అంతంతే
అకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : విస్తరిత జీహెచ్ఎంసీ ఫైనల్ అయింది. తుది నోటిఫికేషన్‌కు సర్కారు పచ్చజెండా ఊపింది. ఔటర్ రింగు రోడ్డు సరిహద్దుగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ విస్తరించింది. 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో పాటు పునర్విభజన ప్రక్రియను సైతం జీహెచ్ఎంసీ చేపట్టడంతో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. 5వేలకు పైగా అభ్యంతరాలు, ఫిర్యాదులు రాగా వాటిలో 20 శాతం కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రధాన నగరం పేరు కరువు
జంటనగరాల్లో ఒక నగరంగా పేరొందిన సికింద్రాబాద్ పేరిట ఉన్న జీహెచ్ఎంసీ సర్కిల్ ప్రస్తుతం కనుమరుగైంది. ఒఝప్పుడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా వెలుగొందిన సికింద్రాబాద్ ప్రస్తుతం ఉనికిని కోల్పోయింది. 1956వ సంవత్సరానికి పూర్వం నగరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి.
అయితే 1956లో ఈ రెండింటిని కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)గా రూపొందించారు. అప్పుడు ఎంసీహెచ్‌లో 100 డివిజన్లు ఉండేవి. సికింద్రాబాద్ పేరిట సర్కిల్‌ను రూపొందించారు. ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007 ఏప్రిల్‌లో శివార్లలోని 9 మున్సిపాలిటీలను ఎంసీహెచ్‌లో కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపొందించారు. సికింద్రాబాద్ సర్కిల్‌ను రెండు సర్కిళ్లుగా చేసి, ఒకదానికి సికింద్రాబాద్, మరోదానికి బేగంపేట్ సర్కిల్‌గా నామకరణం చేశారు.
కనుమరుగు
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించే క్రమంలో డివిజన్ల పునర్విభజన చేస్తూ, కొత్త సర్కిళ్లు, కొత్త డివిజన్లు, కొత్త జోన్లు రూపొందిస్తూ…. సికింద్రాబాద్ పేరిట ఉన్న సర్కిల్ కనుమరుగు కావడం గమనార్హం. అలాగే సికింద్రాబాద్-బేగంపేట్ జంట సర్కిళ్లలో ఒకటైన బేగంపేట్ సర్కిల్ కూడా కనుమరుగు కావడం గమనార్హం.,
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందిన సికింద్రాబాద్ ఉనికి కోల్పోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ సర్కిల్లో ప్రస్తుతం ఉన్న డివిజన్లను పెంచి, దానిని రెండు సర్కిళ్లుగా మార్చారు. తార్నాక, సీతాఫల్మండి, చిలకలగూడ, బౌద్ధనగర్ డివిజన్లను కలిపి…. తార్నాక సర్కిల్‌గా రూపొందించారు. అలాగే మెట్టుగూడ, లాలాపేట్, నార్త్‌లాలాగూడ, అడ్డగుట్ట డివిజన్లతో మెట్టుగూడ సర్కిల్ రూపొందించారు. కాగా బేగంపేట్ సర్కిల్లోని పద్మారావునగర్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లను కొత్తగా ఏర్పడిన కవాడిగూడ సర్కిల్లో కలిపేశారు.
ఫిర్యాదులు బుట్ట దాఖలు
స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో బడంగ్పేట్ సర్కిల్లోని నాదర్గుల్(57), బడంగ్పేట్(61), బాలాపూర్(62) డివిజన్ల సరిహద్దులను స్వల్పంగా మార్చారు. నాదర్గుల్, బడంగ్పేట్ డివిజన్ల మధ్య గతంలో ఉన్న బడంగ్పేట్-నాదర్గుల్ ప్రధాన రహదారి సరిహద్దును మార్చి.. అల్మాస్గూడ కమాన్ నుంచి కొత్త మునిసిపల్ భవనం వరకు గల రోడ్డును సరిహద్దుగా నిర్ణయించారు. అదేవిధంగా పోచారం మునిసిపాలిటీని ఒకే వార్డుగా నిర్ణయించడంతో 500లకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. కానీ దీని విస్తీర్ణం చాలా పెద్దగా ఉన్నా, 10 గ్రామాలు ఉన్నా, ఒకే వార్డుగానే నిర్ణయించడం పట్ల శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర నిరసన, అసంతృప్తి వ్యక్తం చే స్తున్నారు. తుర్క యాంజాల్ మునిసిపాలిటీ పరిధిలో కొహెడా లేదా రాగన్నగూడ వార్డులు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………………….

