
* హైదరాబాద్‌లో నిషేధిత టానిక్
* పోలీసుల విచారణలో వెలుగులోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మత్తు లేనిదే కొందరు ఉండలేకపోతున్నారు. సమయానికి ఏదో రూపంలో దానిని తీసుకోకపోతే పిచ్చోళ్లు అయిపోతున్నారు. అలాంటి వారి బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు వివిధ రూపాల్లో మత్తు మందును విక్రయిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి మాత్రమే కాకుండా ఓజీ కుష్, హాషిష్ ఆయిల్ రూపంలో మాదకద్రవ్యాలను అమ్ముతున్నారు. మరికొందరు మత్తు మోతాదు ఎక్కువ ఉన్న నిషేధిత దగ్గు మందును అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. సరూర్‌నగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్ అష్టలక్ష్మి ఆలయం వద్ద నిషేధిత దగ్గుమందును అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బాలరాజు, సబ్ ఇన్స్పెక్టర్ రవి తన సిబ్బందితో కలిసి లక్ష్మణ్ కదలికలపై నిఘా పెట్టారు. గురువారం మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 కోడిన్ పాస్పెట్ (నిషేదిత దగ్గు మందు) బాటిళ్లను కొనుగోలు చేసి బైక్‌పై తీసుకెళ్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. రూ. 190 ఎంఆర్పీ ధర కలిగిన ఈ దగ్గ మందు బాటిల్స్‌ను లక్ష్మణ్ తన ఇంట్లో పెట్టుకొని రూ. 350 ఒక బాటిల్‌ను అమ్మకాలు చేపడుతున్నట్లు విచారణలో గుర్తించారు. కోడిన్ పాస్పెట్ మందును డ్రగ్స్ అథారిటీ నిషేధించింది. ఈ దగ్గు మందును వినియోగించాల్సి వస్తే డాక్టర్ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాలి. కానీ కొందరు అక్రమార్కులు దగ్గు మందును గుట్టుగా కొనుగోలు చేసి, రహస్యంగా విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక గంజాయి ప్యాకెట్ ధర రూ. 500 ఉంది. ఒక గ్రాము ఎండిఎంఎ డ్రగ్ విలువ రూ. 5 వేలు, ఇతర మాదక ద్రవ్యాల గురించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మత్తుకు బానిసగా మారిన కొంతమంది మార్కెట్లో తక్కువ ధరకు రహస్యంగా దొరుకుతున్న ఇలాంటి నిషేదిత దగ్గు మందును వినియోగించి మత్తులో తేలుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
……………………………………..