* రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్ లైన్
* దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి.. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం
* మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఎగ్గొట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కెసిఆర్ ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండేది.. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధును 7500 చేస్తా అన్నారు.. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు.. ఎన్నికల సమయంలో వడ్లకు బోనస్ అన్నారు.. ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని హెద్దేవ చేశారు.
ప్రతి రైతుకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తే, అవ్వ, తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి, అక్కచెల్లెళ్లకు 2500 ఇయ్యి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీల అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పానని.. నా ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా ఎమ్మెల్యే పదవి వదిలేస్తా అని సవాల్ చేశారు. రైతుబంధు ఎగపెట్టిండు, 4000 పెన్షన్ ఎగపెట్టిండు, అక్కచెల్లెళ్లకు 2500 ఎగపెట్టిండు, వడ్లకు బోనస్ ఎగపెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏ లు ఎగపెట్టిండు, తులం బంగారం ఎగపెట్టిండు. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులని, ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాక బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టదని.. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని.. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామన్నారు.
…………………………………………