
* తెలంగాణ చరిత్రలో మరచిపోలేని రోజు సెప్టెంబరు 17
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : దేశమంతా 1947 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పీలిస్తే, నాటి హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం విముక్తి కలగలేదు. రాష్ట్రం మాత్రం అప్పటికి కూడా నిరంకుశ పాలనలోనే మగ్గిపోయింది. మరో ఏడాది పాటు తీవ్ర నిర్భందాలను ఎదుర్కొంది. నిజాం నాయకత్వంలోని రజాకార్లు భారతదేశంతో విలీనాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. సమైక్యత కోసం వాదించే వారిపై అనేక దారుణాలకు పాల్పడ్డారు. ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత 13 నెలల పాటు నిజాం పాలనలోనే హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఎన్నో పోరాటాలు, ఎందరో త్యాగాల అనంతరం.. 1948లో హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైంది. ఆ రోజును గుర్తుచేసుకునేందుకు ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని వెనుక జరిగిన కథ క్లుప్తంగా..
రాచరిక రాజ్యం నుంచి.. స్వేచ్ఛ దిశగా..
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందినా నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకార్లు, హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఇందుకోసం ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 17, 1948న, భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హైదరాబాద్‌ను నిజాం పాలన నుండి విముక్తి చేయడానికి “ఆపరేషన్ పోలో” అనే సైనిక ప్రచారాన్ని ప్రారంభించారు. భారత ఆర్మీ 1948, సెప్టెంబరు18న నగరానికి చేరింది. అంతకు ఒకరోజు ముందు సెప్టెంబరు 17న ఖాసీం రజ్వీ హైదరాబాద్‌లో నరమేధానికి వ్యూహం పన్నాడు. ఈ విషయం తెలిసి ఉస్మానాబాద్ కలెక్టర్ మహమ్మద్ హైదర్ ఆనాటి నిజాం పోలీసు ఉన్నతాధికారి నవాజ్ దీన్‌యార్‌జంగ్ దగ్గరకు పరుగుతీశాడు. ఇరువురు ఫోన్‌ద్వారా రజ్వీకి నచ్చజెప్పి కల్లోలాన్ని ఆపించారు. ఈ విషయాన్ని మహమ్మద్ హైదర్ జ్ఞాపకాల్లో రాశారు. అంతకు ముందురోజే సైన్యాధ్యక్షుడు ఎల్.ఇద్రూస్ నిజాంను కలిసి సైన్యాన్ని ప్రతిఘటించడం వల్ల మరింత ప్రాణ నష్టం మినహా మరేమీ లేదని విన్నవించాడు. దీంతో సెప్టెంబరు 17న మొదట ఖాసీం రజ్వీ ఖైరతాబాద్‌లోని దక్కన్ రేడియో ద్వారా తన ఓటమిని అంగీకరించాడు. ఆ తర్వాత కేఎం మున్షీతో కలిసి దక్కన్ రేడియోకు చేరుకున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. భారత సైన్యాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వందల ఏళ్ల రాచరిక పాలన నుంచి ఈ నేలకు స్వాతంత్య్రం సిద్ధించింది. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబురాలు చేసుకున్నారు. నగర వీధుల్లో జాతీయ జెండా ఎగరేశారు.
……………………………………………….