- కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళనాడు రాజకీయ పార్టీలు
- క్షమాపణలు చెప్పిన మంత్రి శోభ
- ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర మంత్రి నోరు జారింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శోభ కరంద్లాజే ( Shobha Karandlaje ) కేంద్ర వ్యవసాయ , రైతుల సంక్షేమ శాఖ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవలి బెంగుళూరు లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శోభ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రామేశ్వరం కేఫ్ ( Rameshwaram Cafe) పేలుడు సంఘటనకు ముడిపెడుతూ తమిళ ప్రజలను నిందించారు. దీంతో తమిళ నాడు రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మధురైలో తమిళనాడులో ఐపీసీ ( IPC ) 153 ( ఏ ) తోపాటు ఇతర పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి ( Shobha karandlaje ) హోదాలో ఉన్న శోభ బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ( MK Stalin ) అన్నారు. ఇదే స్థాయిలో తమిళనాడు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ చేసిన శోభ వ్యాఖ్యలపట్ల కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే శోభ వ్యాఖ్యల పట్ల విచారణ జరిపి నివేదిక పంపించాలని అధికారులను ఆదేశించారు. కాగా తమిళనాడు ప్రజల పట్ల తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని , తమిళ ప్రజల హృదయాలను గాయపరిస్తే క్షమించాలని ఆమె కోరారు. ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమస్య ఇంతటితోనే సమసి పోతుందా మరింత తీవ్ర రూపం దాల్చనుందా అన్నది వేచి చూడాల్సిందే..
———————-