
* ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది
* క్రిష్‌కు నా ధన్యవాదాలు
* చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా టాలెంట్ ఉంటేనే నిలబడతారు
* సినిమా ప్రమోషన్ ను నిధి తన భుజాలపై వేసుకుంది
* కీరవాణి ప్రాణవాయువు పోశారు
* హరిహర వీరమల్లు సినిమా ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్
ఆకేరున్యూస్, సినిమా డెస్క్ : సినిమాల్లోకి వెళ్లిపోయాడంటూ రాజకీయ ప్రత్యర్థులు తనను తిడుతున్నా.., రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ప్రమోషన్ కు ముందుకు వచ్చినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సినీ పరిశ్రమకు తనకు అన్నం పెట్టిందని తెలిపారు. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాన్ని, దేశంలోని సమస్యలపై స్పందించేవాడిని అలాంటిది నా సినిమాను నేను వదిలేస్తానా అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో ఆయన పవన్ కల్యాణ్ మాట్లాడారు. సినీ నిర్మాత ఏఎం. రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. రీజినల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లినా, తమిళ్ సినిమాను తెలుగులో డబ్ చేసి, వాటితో సమానంగా ఆడేలా సత్తా చూపిన వ్యక్తి రత్నం అన్నారు. ఫిలిం క్రియేటివ్ ను పెంచిన వ్యక్తి అన్నారు. ఈ సినిమా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. ఈ సినిమా గురించి ఆయన తపన చూసి.. తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత.. అదే తన ప్రాథమిక ఫోకస్ అయ్యాక మళ్లీ ఈ సినిమాను చేయాలని కోరినప్పుడు.. తాను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఇచ్చానన్నారు. మండుటెండల్లో 57 రోజుల పాటు క్లైమాక్స్ తీశామన్నారు. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ఇవన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయన్నారు. క్రిష్ జాగర్లమూడి, ఏఎం రత్నం మంచి సబ్జెక్టుతో తన దగ్గరకు వచ్చారని, కరోనా చాలా ప్రభావం చూపిందని వివరించారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో క్రిష్ బయటకువెళ్లినా ఈ సినిమాకు పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. సినిమా అవుతుందా.. , లేదా అని అనుకున్నప్పుడు, దీని గురించి ఆలోచిస్తూ నీరసం వచ్చినప్పుడల్లా దీనికి ప్రాణవాయువు ఇచ్చారు కీరవాణి. తాను ఎప్పుడూ సినిమాల గురించి అంతగా మట్లాడను.. కానీ ఈ సినిమా గురించి మాట్లాడాలని అనిపించిందన్నారు. ఎందుకంటే నిర్మాత కనుమరుగు కాకూడదని మాట్లాడుతున్నా అన్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్ ను తన భుజాలపై వేసుకుందన్నారు. సమాజంలో కుల, మతాలు ఆధారంగా కొట్టుకుంటున్నా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు కులం, మతం ఉండదన్నారు. పూర్తిగా క్రియేటివ్ మీదేఆధార పడి ఉందన్నారు. చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా టాలెంట్ లేకపోతే నిలబడలేరన్నారు. సత్తా ఉన్న దర్శకుడు జ్యోతికృష్ణ అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సైన్స్ ను తీయగలిగేవాడన్నారు.
………………………………………..