
* ఫలించిన డాక్టర్ శివరంజని సంతోష్ 8 సంవత్సరాల న్యాయ పోరాటం
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఓఆర్ఎస్ లేబుల్ దుర్వినియోగాన్ని నిషేధించింది. ఈ మేరకు (FSSAI) ఆహార ఉత్పత్తులపై “ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్”, “ఓఆర్ఎస్” అనే పదాలను వాడొద్దని స్పష్టం చేసింది. హైదరాబాద్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ ఎనిమిది సంవత్సరాల న్యాయ పోరాటం ఫలితంగా ఈ నిర్ణయం అమలు లోకి వచ్చింది. ఓఆర్ఎస్ఎల్ చక్కెర ఎక్కువగా ఉండి,పేగులలోకి నీటిని లాగి, విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయనీ డాక్టర్ శివరంజని ఒక సామాజిక మాధ్యమంలో వీడియో ద్వారా వివరించారు.వినియోగదారులను ఓఆర్ఎస్ఎల్ తయారీ కంపెనీలు వైద్యపరంగా ఓఆర్ఎస్ తో సమానమైనవని నమ్మేలా తప్పుదారి పట్టించాయనీ మార్కెట్ చేసే కంపెనీలపై పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసి 8 సంవత్సరాలుగా న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.
ఓఆర్ఎస్ అంటే…..
ఓఆర్ఎస్: ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన ఒక ప్రామాణిక ఫార్ములా, ఇందులో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్, గ్లూకోస్ ఆన్‌హైడ్రస్ ఉంటాయి. విరేచనాలు, వాంతులు, లేదా వేడి వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను చికిత్స చేయడానికి ఇది తయారు చేయబడింది. సాధారణంగా పొడి రూపంలో లేదా ముందస్తుగా తయారు చేసిన ద్రవ రూపంలో ఫార్మసీలలో దొరుకుతుంది.
ఓఆర్ఎస్ఎల్ అంటే…..
ఓఆర్ఎస్ఎల్ ఒక వాణిజ్య బ్రాండ్,ఇది ఆపిల్, ఆరెంజ్ వంటి రుచులతో రెడీ-టు-డ్రింక్ టెట్రా ప్యాక్‌లలో లభిస్తుంది. WHO ఓఆర్ఎస్ ఫార్ములాను పాటించకుండా, ఇందులో ఎలక్ట్రోలైట్స్, గ్లూకోస్, సుక్రోస్ ఉంటాయి. ఓఆర్ఎస్ఎల్ సాధారణ హైడ్రేషన్, అలసట, వేడి ఒత్తిడి, లేదా వ్యాయామం తర్వాత రీహైడ్రేషన్ కోసం మార్కెట్ చేయబడుతుంది. కొన్ని రకాల ఓఆర్ఎస్ఎల్లో బి-కాంప్లెక్స్, విటమిన్ సి వంటి అదనపు విటమిన్లు కూడా ఉంటున్నాయి.
ORS , ORSL ఏది మంచిది ?
ఓఆర్ఎస్ అనేది ఒక ఔషధం.తీవ్రమైన డీహైడ్రేషన్ కోసం WHO సూచించిన ఓఆర్ఎస్ ఉత్తమం. కానీ ఓఆర్ఎస్ఎల్ ఒక ఫోర్టిఫైడ్ బీవరేజ్. సాధారణ హైడ్రేషన్ కిోసం ఓఆర్ఎస్ఎల్ వాడవచ్చు. కానీ దీంట్లో అధికమైన చక్కెరలో ఉండడంవల్ల డిహైడ్రేషన్ కి గురవుతాం.
డాక్టర్ శివరంజని గురించి..
డాక్టర్ శివరంజని సంతోష్ హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు. ఆమె ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాల్సీ వైద్యంలో నిపుణురాలు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS)గా బ్రాండ్ చేసే కంపెనీల గురించి అవగాహన పెంచడానికి ఆమె ఓ ఆర్ ఎస్ తయారు చేస్తున్న కంపెనీలకు విరుధ్దంగా ఒంటరి పోరాటం చేశారు.పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి ఉత్పత్తులను నిషేధించాలని పోరాటం చేసి చివరకు విజయం సాధించింది.
………………………………………..