* మామునూర్ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం
* త్వరలో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టులు
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలో అని ప్రణాళికలు వేసుకొని ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatreddy) మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ (warangel) జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దాదాపు రూ.4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. మాది అభివృద్ధి విదానం – వాళ్లది ఫక్తూ రాజకీయమేనన్నారు. వరంగల్ జిల్లా ప్రజల చిరకాలవాంచ మామునూర్ ఎయిర్ పోర్ట్ (airport) ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు . మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అడ్డంగా మారిన 150 కిలోమీటర్ల (150 km) జీఎమ్మాఆర్ నిబంధనను ఉపసంహరించుకునేలా చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించి ఒప్పించినట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 6వ తేదిన ఏవియేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన 280 ఎకరాల 30 ఎకరాల భూమి లో 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. రూ. 205 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అదిగో , ఇదిగో మామునూర్ ఎయిర్ పోర్ట్ అంటూ ఊరించిందన్నారు. మొదటి దశలో మామునూర్ ఎయిర్ పోర్ట్ ను స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, మాస్టర్ ప్లాన్ తయారీ, ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ చేసేందుకు 8 నెలల పూర్తవుతుందన్నారు . రెండవ దశలో రోజంతా ఇంటర్ నేషనల్ విమానాలు (పెద్ద విమానాల-A320, B737) మరియు కార్గో విమానాల ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 6 నెలల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఇచ్చిన జీఓ ను మీడియా ప్రతినిధులకు అందించారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు) ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు పెద్ద విమానాలను నడిపే విధంగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధించి నిర్మాణం చేపడతామని చెప్పారు. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో సాధించని ఎయిర్ పోర్టులను నాలుగేండ్లలో సాధించి చూపిస్తామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ రహదారి అభివృద్ధి..
హైదరాబాద్ – విజయవాడ (NH-65) విస్తరణ పనులు చేపట్టాలని నేను అడిగిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 6 వరుసల ఎక్స్ ప్రెస్ హైవేను మంజూరీ చేశారని చెప్పారు . ప్రస్తుతం దానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయ్యే స్టేజీలో ఉందన్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని తద్వారా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళ్తారని ఆయన వెల్లడించారు.
రైతుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులే కలెక్టర్ పై దాడి చేశారు
రైతుల ముసుగులో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఇలానే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళా అని ప్రశ్నించారు. రేప్ కేసులో ఉన్న రౌడీ బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఐఏఎస్ పై దాడులు చేస్తుంటే.. ఖండించాల్సింది పోయి మా కార్యకర్తేనని సిగ్గులేకుండా కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తోందని మాది అంబేద్కర్ రచించిన రాజ్యంగం ఫాలో అయ్యే పార్టీ అని.. అందుకే ప్రతీది చట్ట ప్రకారం జరుగుతుందని తెలిపారు. వారిది కేసిఆర్ రాజ్యాంగమని అందులో న్యాయం, ధర్మం, చట్టం ఉండదని.. వాళ్లకు నచ్చకపోతే జైలుకు పోయే పరిస్థితులను మనం కళ్లారా చూసామని ఆయన చెప్పారు. నేను ఎమ్మెల్యే – ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ నన్ను అనేకసార్లు హౌస్ అరెస్టు చేశారన్నారు.
ఢిల్లీలో దోమల బాధ కోసమే కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రజలు పదవులు ఇచ్చింది ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి మేలు చేయడానికా? గల్లీలో ఉండేదానికా? అని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కి దమ్ముంటే నల్గొండలో మూడు నెలలు పడుకొని కాళ్ళు చేతులు వంకరలు కాకుండా హైదరాబాద్ రాగలడా అని ఛాలెంజ్ చేశారు? కిషన్ రెడ్డికి ఢిల్లీలో దోమల భాధకు తట్టుకోలేక హైదరాబాద్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బాషీర్ భాగ్ లో రైతుల పై చంద్రబాబుతో కలిసి కేసీఆర్ కాల్పులు జరిపించి ఇప్పుడు రైతులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధీకరణ వద్దు అని ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు.
—————————————————————-
……………………………………………………