
* ఈటల, బండి సంజయ్‌ల విషయం తేల్చాలని డిమాండ్
* పాత, కొత్త అధ్యక్షులు కూర్చుని మాట్లాడాలని సూచన
* హైకమాండ్ కూడా జోక్యం చేసుకోవాలని వినతి
* రాజాసింగ్ కావాలంటే మళ్లీ బీజేపీలోకి రావొచ్చు
* కాంగ్రెస్, బీఆర్ ఎస్ కలహాలపైనా అరవింద్ వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : పార్టీలో అంతర్గత విభేదాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Aravind) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత, కొత్త అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. అధిష్ఠానం పెద్దలు కూడా జోక్యం చేసుకోవాలన్నారు. బీజేపీలోనే కాదని, అన్ని పార్టీల్లోనూ అంతర్గత గొడవలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ కొండా దంపతులు, రాజగోపాల్ రెడ్డి, బీఆర్ ఎస్‌లో కవిత, కేటీఆర్ గొడవలు లేవా అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయని, బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో కూర్చోని మాట్లాడాలని సూచించారు. వారి విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు. రాజాసింగ్ (Rajasingh) ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని కోరారు ఎంపీ అరవింద్. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇదని ఉద్ఘాటించారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని.. బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ (Bjp) గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు.
…………………………………….