* దేశభక్తి పంచాయతీల నుంచే పెరగాలి
* వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసింది
* 75 శాతం గ్రామాలకు వైసీపీ సర్పంచ్‌లే
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, అన్నమయ్య జిల్లా : తనకు సినిమాల కంటే దేశం ముఖ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Cm Pavan Kalyan) వెల్లడించారు. దేశభక్తి పంచాయతీల నుంచి పెరగాలని అన్నారు. అన్నమయ్య జిల్లా (Annamayya District) మైసూరివారి పల్లెలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఏపీ అభివృద్దే తమ లక్ష్యం అన్నారు. వైసీపీ(Ycp) హయాంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. దేశాభివృద్ధికి పంచాయితీలు చాలా కీలకమన్నారు. రాజస్థాన్ తర్వాత పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతంలో ఏపీ (AP) రెండో స్థానం లో ఉండేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 వేల కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టినట్లు చెప్పి, కేవలం 10 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ కల్పించలేకపోయారన్నారు. మిగతా వేల కోట్లు ఏమయ్యాయే ఎవరికీ తెలియలేదని వెల్లడించారు. భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అన్నారు. గ్రామాలుంటేనే దేశం బాగుంటుందన్నారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీ(YCP) సర్పంచ్ లే ఉన్నారని, రాజకీయాలకు అతీతంగా అభివృద్దే కూటమి లక్ష్యం అన్నారు. మనం అందరం ఐక్యంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh)అప్పులను తీర్చే సత్తా ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారని తెలిపారు. తాను మనుషులను కలిపే వ్యక్తిని కానీ, విడగొట్టే వాడిని కానన్నారు. పార్టీకోసం పనిచేసిన వారిని వదులుకోనని వెల్లడించారు. పదవులు తనకు బాధ్యత కానీ, అలంకరణ కాదన్నారు. చంద్రబాబు (Chandrababu)అపార అనుభవం ఏపీకి అవసరమన్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని వెల్లడించారు.
——————————————