* ‘మహాలక్ష్మి’ హామీపై కల్వకుంట్ల కవిత పోరు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా భవన్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే ‘మహాలక్ష్మి’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి శ్రేణులు నినదించారు. ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇచ్చిన ప్రధాన హామీని ప్రభుత్వం విస్మరించిందని కవిత విమర్శించారు. అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా, మహిళల ఖాతాల్లోకి నగదు జమ కాకపోవడంపై కవిత మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. రూ. 2,500 సాయం కోసం కోట్లాది మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. హామీలు ఇచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం, అమలు చేసేటప్పుడు ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి మహిళా నాయకులతో కలిసి కవిత ప్రజా భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, తమకు రావాల్సిన ఆర్థిక సాయంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. “గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేయడం సరికాదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ పథకంపై స్పష్టత ఇచ్చే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని తెలంగాణ జాగృతి కవిత స్పష్టం చేసింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
