Pawan Kalyan Surgery Mumbai
* పవన్ కళ్యాణ్‌కు విజయవంతంగా సర్జరీ..
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజం శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. శనివారం ఉదయం వైద్యుల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి ఆయన కుడి భుజానికి ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.
* రెండు భుజాలకు గాయాలు…
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రెండు భుజాల తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయన రెండు భుజాల్లోనూ ‘రొటేటర్ కఫ్’ (కండరాల చిట్లిపోవడం) సమస్యతో పాటు కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
2016 లో సినిమాల్లో స్టంట్లు చేస్తున్న సమయంలో తగిలిన గాయాలు, ఆ తర్వాత రాజకీయాల్లో భాగంగా నిర్వహించిన పోరాట యాత్ర, వారాహి యాత్రల సమయంలో మరింత తీవ్రరూపం దాల్చాయని వైద్యులు తెలిపారు.
ముఖ్యంగా పర్యటనల్లో అభిమానులతో నిరంతరం కరచాలనం చేయడం, చేతులు పట్టుకుని లాగడం వంటి కారణాల వల్ల భుజాలపై అదనపు ఒత్తిడి పడి సమస్య పెద్దదైంది.
* ఒకేసారి రెండు సర్జరీలు ఎందుకు చేయలేదంటే..
వైద్యులు పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాలకూ శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయితే, రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ నిర్వహిస్తే రోజువారీ కదలికలు పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా, నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేశారు.
అందువల్ల ఈ రోజు ఉదయం కేవలం కుడి భుజానికి మాత్రమే 3.5 గంటల పాటు సర్జరీ నిర్వహించారు. మరో భుజానికి (ఎడమ చేతికి) రెండు నెలల వ్యవధి తర్వాత శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్య బృందం వెల్లడించింది.
* ప్రజా సేవ కోసమే సర్జరీ ఆలస్యం..
జూన్ ఆఖరి వారంలోనే పవన్ కళ్యాణ్‌కు అత్యవసరంగా సర్జరీ చేయాలని ముంబై వైద్యులు స్పష్టం చేశారు. కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ముందే ఖరారైన కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమీక్షలను పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
“ప్రజా సేవ కోసం ముందే నిశ్చయించుకున్న కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటాను” అని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే వైద్యులకు తెలిపి, తీవ్రమైన నొప్పిని భరిస్తూనే విధుల్లో పాల్గొన్నారు.
* 3 వారాల పాటు విశ్రాంతి
ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం కావడంతో జనసైనికులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ దాదాపు 3 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత ప్రత్యేక ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించారు. కోలుకున్న అనంతరం ఆయన మళ్లీ యధావిధిగా ఏపీ ప్రభుత్వ విధుల్లో పాల్గొననున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
