SIR Double Vote Warning
* ఓటర్లకు తెలంగాణ సీఈఓ హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉద్దేశపూర్వకంగా రెండు వేర్వేరు ప్రాంతాలలో ఓటు హక్కును కలిగి ఉన్నవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నట్లు నిర్ధారణ అయితే, వారికి ఏడాది వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
* సమగ్ర సవరణ (SIR)తో చెక్
తెలంగాణలో ప్రస్తుతం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్షాళనలో భాగంగా బహుళ ఓట్లను (రెండు చోట్ల నమోదైన ఓట్లు) పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఒకే ఓటరు వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ప్రాంతాల్లో ఓటు కలిగి ఉన్నారా అనే విషయాన్ని అధికారులు గుర్తిస్తున్నారు.
* ఓటర్లే స్వచ్ఛందంగా సరిచేసుకోవాలి
తెలిసో తెలియకో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదై ఉంటే, ఓటర్లు తక్షణమే అప్రమత్తం కావాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల అధికారులు (BLO) లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ఏదో ఒక చోట మాత్రమే ఓటు ఉంచుకుని, రెండో దానిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని స్పష్టం చేశారు.
* పారదర్శకతే లక్ష్యం
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా ఓటరు జాబితాలను సిద్ధం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఈఓ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా డబుల్ ఓట్లు కలిగి ఉండేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
