
* అందుకోసం తుపాకులు వీడాలనడం సరియైంది కాదు
* కర్రె గుట్టలు అంతు చిక్కని అద్భుతాలు
* ఆదిమ కాలం వేట ఇక్కడి ప్రత్యేకత
* సొరంగాలే మావోయిస్ట్‌ల రక్షణ కవచాలు
* అబూజ్ మాడ్ కంటే కర్రె గుట్టలు భిన్నమైన ప్రాంతం
* మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు లంకా పాపిరెడ్డి
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్, వరంగల్, మే 6: ఆపరేషన్ కర్రె గుట్టలు ఇపుడు అంతటా వినబడుతున్న అంశం. తెలంగాణ- చత్తీష్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కర్రె గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ కర్రె గుట్టలు మావోయిస్ట్‌లకు , పోలీస్ బలగాలకు మద్య నిర్ణయాత్మక పోరును నిర్ణయించే ప్రాంతంగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది. మరో వైపు మావోయిస్ట్ పార్టీ తో చర్చలు జరపాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. చర్చల పట్ల సానుకూలంగా మావోయిస్ట్ పార్టీ స్పందించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం మావోయిస్ట్‌లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. చర్చలు జరపాలన్న డిమాండ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక వాదులు , వివిద రకాల సంఘాలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నారు. చాలా చోట్ల ఇదే డిమాండ్‌తో ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. కర్రె గుట్టల కేంద్రంగా పారా మిలిటరీ బలగాలు మాత్రం మావోయిస్ట్‌లను ఏరివేసే కార్యక్రమాన్ని మరింత పకడ్భందీగా అమలు చేస్తున్నాయి. చర్చలు అవసరమా..? చర్చలు జరిగే అవకాశం ఉంటుందా అన్న విషయాలతో పాటు కర్రెగుట్టల ప్రత్యేకత ఏంటి..? ఇప్పటికీ మావోయిస్ట్‌లు ఈ గుట్టల్లో ఉండే అవకాశాలుంటాయా..? అన్న అంశాలపై సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటి మాజీ సభ్యుడు లంకా పాపిరెడ్డితో ఆకేరు న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్ర: సర్ చెప్పండి.. మావోయిస్ట్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందంటారా..?
లంకా పాపిరెడ్డి: కేంద్ర ప్రభుత్వ వైఖరినీ ఇటీవలనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ చెప్పారు కదా.. బహుశా అదే కేంద్ర ప్రభుత్వ వైఖరి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ హోం మంత్రిగా కూడా ఉన్నాడు కదా.. అయితే పౌర సమాజం డిమాండ్‌కు ప్రభుత్వాలు తలొగ్గే అవకాశాలు కూడా లేక పోలేదు. తెలంగాణలో చర్చలు జరపాలన్న డిమాండ్ మొదలు పెట్టినప్పుడు పిడికెడు మంది మాత్రమే ఉన్నారు. ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు ఇతర సంఘాలు , రాజకీయ పార్టీలు కూడా శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్‌తో ముందుకు వస్తున్నారు.
ప్ర: ఆయుధాలు వదిలేస్తేనే చర్చులు జరుపుతామన్న వాదన ప్రభుత్వం వైపు నుంచి వస్తోంది..? ఆయుధాలు వదిలేయాలంటారా..? శాంతి చర్చల్లో ప్రధాన ఎజెండా ఏది ఉండాలంటారు..?
లంకా పాపిరెడ్డి: ఆయుధాలు వదిలేసిన తర్వాత ఇక చర్చల అవసరం ఎందుకు ఉంటుంది. ఆయుధాలు వదిలేశారంటే పూర్తిగా లొంగిపోయినట్లే కదా..? ఇక లొంగిపోయిన వాళ్ళతో శాంతి చర్చలు ఎందుకు జరుపుతారు..? మావోయిస్టులు చెప్పే ప్రజల ప్రయోజనాలు ఏమిటి ? అవి భారత చట్టపరిధిలో పరిష్కరించగలిగినవే అయితే వారికి హామీ ఇవ్వవచ్చు . లేకపోతే సాధ్యం కాదని చెప్పి చర్చలను రద్దు కూడా చేసుకోవచ్చు . ఏదైనా తేలాలంటే ముందు చర్చలు జరిగితేనే కదా తెలిసేది . దేశానికీ కూడా అర్ధం అవుతుంది కదా. ఎటువంటి హామీలు లేకుండా ఆ హామీలు అమలు అవుతాయని నమ్మకం కలిగించకుండా తుపాకులను కింద పెట్టమని ప్రభుత్వం డిమాండ్ చేయడం అంటే ఆచరణలో చర్చలను తిరస్కరించడమే అని అర్ధం . ఇప్పుడు ఆదివాసీల ముఖ్య ఆదాయమైన ఇప్పపూవు , తునికాకు సేకరించే కాలం . ప్రభుత్వం కండిషన్లు పెట్టకుండా ముందు చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించాలి . చర్చల తర్వాత ప్రజలకు ఏ విషయమైనా ఎవరైనా చెప్పుకోవచ్చు. అప్పుడు న్యాయబద్ధత ఉంటుంది . భారతదేశంలోనే నాగాలాండ్ లో 1997 నుండి ఇప్పటివరకు “నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్” వారితో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది . వాళ్లు ఇప్పటికీ తుపాకులు కింద పెట్టలేదు . ఇటువంటి సజీవ ఉదాహరణ ఉండగానే , తుపాకులు కింద పెడితేనే చర్చలు అని మావోయిస్టులకు చెప్పడం అర్థం లేనిదిగా ఉంటుంది .
ప్ర: మావోయిస్ట్‌లు బలహీన పడ్డారు కాబట్టే శాంతి చర్చల ప్రస్తావన ముందుకు తెస్తున్నారన్న వాదన కూడా ఉంది..? మీరేమంటారు..?
లంకా పాపిరెడ్డి: బలహీనంగా ఉన్నారు కాబట్టే శాంతి చర్చల ప్రస్తావన అన్న వాదన సరియైంది కాదు. గతంలో కూడా చర్చలు జరిగాయి కదా.. అప్పుడేమి బలహీనంగా లేరు కదా.. ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసీల హననం జరుగుతోందని మావోయిస్ట్ పార్టీ అంటోంది. ఆదివాసీల ప్రయోజనాలు ఇతర అనేక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. తాత్కాళికంగానైన శాంతి నెలకొనడం చాలా ముఖ్యమైన పరిణామం. శాంతి చర్చలు జరపడం ఇపుడు ఎంతో అవసరం అని నేను భావిస్తున్నాను,
ప్ర: సర్, ఇక కర్రె గుట్టల గురించి మాట్లాడుకుందాం.. నిజంగా కర్రె గుట్టలు శత్రు దుర్భేద్యంగా ఉండి మావోయిస్ట్ దళాలకు రక్షణ కవచంగా నిలబడే అవకాశాలు ఉన్నాయంటారా..?
లంకా పాపిరెడ్డి: ఏ ప్రాంతం కూడా ఎల్లకాలం శత్రు దుర్భేద్యంగా ఉండవు. వాటికి సంబందించిన సమాచారం పోలీస్ బలగాలకు లేనంత కాలమే దుర్భేద్యం. ఇపుడే కాదు.. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఎన్ కౌంటర్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సహజ సిద్దమైన కొండలు విశాలంగా ఉండడం.. అనేక సొరంగాలు ఉండడం మావోయిస్ట్‌లకు కలిసి వచ్చే అవకాశం కొంత మేర ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లోకి కూడా వెళ్ళ గలిగే పారా మిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. కర్రె గుట్టలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు సాగుతున్నట్టుగా అర్థమవుతోంది.
ప్ర: మీకు కర్రె గుట్టలకు ఉన్న అనుబంధం గురించి చెప్పండి. పేద్ద కొండలు, సొరంగాలు ఉంటాయి అని మాత్రమే చెప్పకుండా అక్కడి ప్రజలు, మీరు గమనించిన ప్రత్యేక అంశాల గురించి చెప్పండి..?
లంకా పాపిరెడ్డి : అనుబంధాలు- బంధాలు ఏముంటాయి .. అప్పటి పీపుల్స్ వార్‌లో పనిచేసినప్పుడు ఆర్గనైజేషన్ కార్యకలాపాల రీత్యా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. కర్రె గుట్టలను బహుశా వాటి రూపాన్ని బట్టి కర్రె గుట్టలు అంటున్నారు. రికార్డుల్లో మాత్రం అలబాక కొండలు అని ఉంటుంది. కర్రె గుట్టలు నిజంగానే భౌగోళికంగా మావోయిస్ట్ పార్టీకి చాలా కీలక ప్రాంతంగానే చూడాలి. మిగిలిన కొండలకంటే ఇవీ నిటారుగా ఉంటాయి. వీటిని ఎక్కడం అంత సులభమైన విషయమేమి కాదు. ఒక దాని మీద ఒకటి మూడు దశలుగా ఉంటాయి. ఒక కొండ పరిమాణంలో స్వల్పంగా ఉన్నప్పటికీ రెండు మాత్రం చాలా ఎత్తుగా విశాలంగా ఉంటాయి. ఈ కొండల మీద ఏడు గ్రామాలు ఉండేవి. ఇపుడు ఎన్ని ఉన్నాయన్నది మాత్రం తెలియదు.
ప్ర: కర్రె గుట్టల్లో ఆదివాసీల జీవన విదానం ఎలా ఉండేది..? కనీస సౌకర్యాలు ఉండవు కదా ఎలా జీవనం కొనసాగించేవారు..?
లంకా పాపిరెడ్డి: అడవిలో ఆదివాసీ జీవన విదానం ఒక్కో తెగ కొన్ని విషయాల్లో ప్రత్యేకతలు ఉంటాయి. కర్రె గుట్టల్లో వెదురు వనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని బుట్టలుగా అల్లి గుట్ట కింద గ్రామాల్లో ఉన్న సమీప గ్రామాల్లోని సంతలో అమ్మి తమ కుటుంబ అవసరాలకు అవసరమైన సరుకులు తెచ్చుకునే వారు. ఇక్కడి ఆదివాసీల వేట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక విదంగా పురాతన మానవులు ముఖ్యంగా నియాంర్తల్ మానవుల వేటను పోలీ ఉంటుంది. వేటాడాల్సిన జంతువులను కొండ అంచు వరకు తమ సాంప్రదాయ ఆయుధాలతో వాటిని తరుముతారు. పై నుంచి లోయలోని బండల మీద పడేటట్లు చేస్తారు. దీంతో ఆ జంతువులు గాయపడడమే, చనిపోవడమో జరుగుతుంది. ఇలాంటి వేట పురాతన మానవులు అవలంభించేది. ఆదిమానవులకు ఒకప్పుడు ఈ కర్రె గుట్టలు ఆలవాలంగా ఉండేవనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ డోల్మైన్ సమాధులు ( రాక్షస గూళ్ళు ) చాలా చోట్ల ఉన్నాయి.
ప్ర: కర్రె గుట్టల్లో పులులు, సింహాలు లాంటి జంతువులు కూడా ఉండే అవకాశం ఉందా.? మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి..?
లంకా పాపిరెడ్డి: చాలా రకాల జంతువులు ఉంటాయి కాని సింహాలు ఉండవు. పులులు, చిరుత పులులు అప్పట్లో కనిపించాయి. ఇక అడవిలో ఉండే అన్ని రకాల జంతువులు ఉంటాయి. చింతలు , పండ్ల చెట్లు చాలా ఉంటాయి. అన్నిటికీ మించి లోయలు, సొరంగాలు చాలా ఉంటాయి. ఆకస్మాత్తుగా కొండల నుంచి వేగంగా వరదలు వస్తాయి. ఒక సారి మేము అలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాం. దళం ఒక దగ్గరం మకాం వేసింది. వంటలు చేస్తున్నారు. కొంత సేపటికి పై నుంచి బొల బల మంటూ శబ్దం వస్తోంది. మాకు ముందు అర్థం కాలే… స్థానికుడైన దళ సభ్యుడు గుర్తించి అప్రమత్తం చేశాడు. అప్పటికే కిట్ బ్యాగ్‌లన్నీ పైకి విసిరేశాడు.. వేగంగా వరద రావడంతో వంట సామాగ్రి మొత్తం వరదలో కొట్టుకు పోయింది. కొద్ది సేపటికే అస్సలు అక్కడ అంత పెద్ద వరద వచ్చిన ఆనవాళ్ళు లేకుండా పోయాయి.
ప్ర: ఇక్కడి కొండెంగలు కూడా ప్రత్యర్థులుగా మారి దాడులు చేస్తాయని విన్నాను నిజమేనంటారా..?
లంకా పాపిరెడ్డి: నిజమే.. సాధారణ కొండెంగల కంటే ఇక్కడ పరిమాణంలో కొంచెం పెద్దగా ఉంటాయి. స్థానికి ఆదివాసీలు వీటిని వేటాడుతారు. దీంతో మనుషుల అలికిడి వినబడగానే అలర్ట్ అవుతాయి. ఒకసారి లోయలో మా దళ మంతా వెళుతున్నాం.. పై నుంచి శబ్దం రావడంతో చూసి పక్కకు వెళ్ళాం.. పెద్ద బండ రాళ్ళను కొండెంగలు కిందికి దొర్లించాయి పక్కకు తప్పుకున్నాం కాబట్టి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి దళాలు ఏదో ఒక వైపు కాకుండా రహదారి మద్యలో నడవడం అలవాటు చేసుకున్నాం.
ప్ర: ఎలాంటి పంటలు పండిస్తారు..? ఆహారం కాకుండా ఇతర ఏ వృత్తి పై ఆదివాసీలు ఆధారపడతారు..?
లంకా పాపిరెడ్డి: ఇదీ కొండ ప్రాంతం .. సారవంతమైన నేల లేక పోవడంతో పెద్దగా పంటలు పండే అవకాశం లేదు. సామలు, పజ్జొన్నలు మాత్రమే సాగు చేస్తారు. వెదురు బాగా దొరుకుతుండడంతో బుట్టలు అల్లడం కొండ కింది సంతల్లో అమ్ముకోవడం ప్రధాన వ్యాపకంగా ఉండేది. బుట్టలు అల్లే టప్పుడు రేడియోలు వచ్చే పాటలు వింటూ సేద తీరేవారు. దాదాపు 45 ఏళ్ళ క్రితమే ఈ గుట్టల్లో ప్రభుత్వం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. పైకి ఎక్కేందుకు వెదురు నిచ్చెన ఉండేది.. అప్పటి కలెక్టర్ ఒకరు వెదురు నిచ్చెన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఇనుప నిచ్చెన ఏర్పాటు చేశారు.
—————————————– 0—————————————