
పెమ్మసాని చంద్రశేఖర్
* ఎన్నికల వేళ టాక్ ఆఫ్ ది ఏపీ
* ఎలక్షన్ అఫిడవిట్‌తో టాక్ ఆఫ్ ది కంట్రీ
* ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తయినా ప్రచారంలో హిస్టరీ
* క్లాస్ గా ఉన్నా.. మాస్ డైలాగులు
* చెయ్యేస్తే నరికేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్‌లు
ఆకేరు న్యూస్ ప్రతినిధి, విజయవాడ : ఎవరీ పెమ్మసాని.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎన్నేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారు.. ఇప్పుడే ఎందుకు సంచలనంగా మారారు.. ఇలాంటి ప్రశ్నలెన్నో తెరపైకి వస్తున్నాయి. ఏపీ ఎన్నికల వేళ ఈ పేరు పాపులర్ అయింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన పొందుపరిచిన ఆస్తుల వివరాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. దేశంలోనే రిచెస్ట్ అభ్యర్థి అనే చర్చ జరుగుతోంది. అందుకు కారణం.. అఫిడవిట్ లో ఆయన పొందుపరిచిన ఆస్తులు అక్షరాలా ఐదు వేల ఏడు వందల ఐదు (5,705) కోట్ల రూపాయలు. ఆ విషయం తెలిసిన వారు ఆయనను ఏపీ కుబేరుడిగా వర్ణిస్తున్నారు.
బుర్రిపాలెం బుల్లోడు
బుర్రిపాలెం బుల్లోడు అనగానే సాధారణంగా సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకొస్తారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ తెరపైకి వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన చంద్రశేఖర్ తండ్రి వ్యాపార రీత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్ 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించారు. తరువాత మెడికల్‌లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. మెడికల్ పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ లను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గైసింగర్ వైద్య కేంద్రం నుంచి పూర్తి చేయడమే కాకుండా అందులో అత్యధిక మార్కులు సంపాదించారు. తన ప్రతిభను దేశానికి చాటారు. పీజీ శిక్షణా సమయంలో సైతం అమెరికా దేశంలో జరిగే వైద్య విద్య విజ్ఞానపు పోటీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం తరఫున పాల్గొన్న అయన వరుసగా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు అమెరికాలో ఉన్న దాదాపు వంద సంస్థలను వెనక్కి నెట్టి.. సక్సెస్ సాధించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ సంస్థ నుంచి కూడా డాక్టర్ పెమ్మసాని 2020 సంవత్సరంలో ప్రతిష్టాత్మక “ఎర్నేస్ట్ ఎంటర్ప్రెన్యూర్“ అవార్డును అందుకున్నారు. ఇదేవిధంగా అమెరికాలోని అనీక ప్రతిష్టాత్మక మీడియా సంస్థలైన మీడియం, సీఈఓ వరల్డ్, ఫాస్ట్ మాగజైన్లు కూడా అవార్డులు అందించాయి. భారతీయ మూలాలు కలిగిన అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్‌లో సైతం పెమ్మసాని సభ్యుడే.
పుట్టినగడ్డపై ప్రేమ
ఉన్నత విద్య, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని 20 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. స్వదేశంపై ప్రేమతో అమెరికా పౌరసత్వం తీసుకోలేదు. పుట్టినగడ్డపై ఉన్న ప్రేమతో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. నెల్లూరు, గుంటూరు తదతర ప్రాంతాల్లో బోర్లు ఎన్నో తవ్వించారు. సుమరు వంద వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అవసరార్దులను ఆదుకుంటున్నారు. సేవలను విస్తృతం చేయాలనే ఆలోచనతో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. తెలుగుదేశంలో చేరి అమెరికాలో ఎన్నారై విభాగం కార్యకలాపాలు చూసుకునేవారు. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండేవారు. వాస్తవానికి ఆయన పదేళ్ల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి ఉంది. గత ఎన్నికల్లోనే నర్సాపురం ఎంపీ టికెట్ దాదాపు ఖాయమైంది కూడా. నాటి పరిస్థితులు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయన నడుచుకున్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ సీటు ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్‌కు దక్కింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తయినా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ప్రత్యర్థులకు దీటుగా దూసుకెళ్తున్నారు.
ఆస్తుల విలువ తెలిస్తే..
పెమ్మసాని ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాల్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పీ చంద్రశేఖర్ దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నేతగా నిలిచారు. చంద్రశేఖర్ కుటుంబీకుల ఆస్తుల విలువ అక్షరాల రూ.5,705 కోట్లు. ఈ విషయాన్ని ఆయన ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అదే సమయంలో తనకు రూ.1,038 కోట్ల అప్పులున్నట్లుగా తెలిపారు. దేశంలో ఇంత మొత్తంలో ఆస్తులు చూపిన నేతగా చంద్రశేఖర్ నిలిచారు. చంద్రశేఖర్ పేరిట రూ. 2,316 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన భార్య శ్రీరత్న పేరిట రూ.2,289కోట్లు, అలాగే పిల్లల పేరిట రూ.992 కోట్ల స్థిరాస్తులు పేర్కొన్నారు. అలాగే, బెంజ్, టెస్లా, రోల్స్‌రాయిస్, ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయని తెలిపారు. చంద్రశేఖర్ పేరిట రూ.72కోట్ల విలువైన భూములు, భవనాలు.. భార్య పేరిట 34,82కోట్ల విలువైన భూములు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వద్ద నగదు రూ.2,06,400.. భార్య శ్రీరత్న వద్ద రూ.1,51,800, కొడుకు వద్ద రూ.16,500, కూతురు వద్ద రూ.15,90 నగదు ఉన్నట్లు వివరించారు.
పంచ్ డైలాగులు
అమెరికాలో వైద్యుడిగా, వ్యాపారవేత్తగా ఎదిగిన పెమ్మసాని చంద్రశేఖర్ చూసేందుకు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. కానీ పదునైన డైలాగులతో రాజకీయాల్లో సంచలనంగా మారారు. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని చెబుతున్నారు. కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకమని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి తనపై చేయి వేస్తే.. ఆ చేయి తీసేస్తానని ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను జైల్లో పెడితే మరింత ఎక్కువ పోరాడతానన్నారు. తనకు పుస్తకాలు రాసే అలవాటు ఉందని, జైల్లో పేపర్లు, పెన్నులు ఇస్తారని.. పుస్తకాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తానన్నారు.
————————————-