* ఏవేం ధరలు తగ్గుతాయో తెలుసా?
* మోదీకి కృతజ్ఞతలు : బండి సంజయ్
* కాసేపట్లో ప్రధాని కీలక ప్రసంగం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీ ఎస్ టి) ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన నాటి నుంచే దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చాలా వస్తువుల ధరలు దిగి వస్తాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు అంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ధరలను బాగా పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈక్రమంలో ఈరోజు సాయంత్రం ప్రధాని పలు అంశాలపై ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కొత్త GST 2.0 రేట్లు, స్వదేశీని ప్రోత్సహించడం, అమెరికా సుంకాలను పరిష్కరించడంలో భారతదేశం వ్యూహం వంటి కీలక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉండడంతో ఆసక్తి ఏర్పడింది.
4 నుంచి 2కు
జీఎస్టీ సవరణల అనంతరం రెండు స్లాబులే మిగిలాయి. గతంలో 5, 12, 18, 28 నాలుగు శ్లాబులుగా జీఎస్టీ ధరలు ఉండేవి. ఇప్పుడు వాటిలో12, 28 శాతాన్ని తొలగించారు. ఇక 5, 18 శాతం జీఎస్టీ శ్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు. అయితే, లగ్జరీ వస్తువులు, హానికర ఉత్పత్తులపై 40 శాతం కొత్త శ్లాబ్ తీసుకొస్తున్నారు. అయితే, 28 శాతం, 12 శాతం శ్లాబుల్లో ఉన్న చాలా వస్తువులు, నిత్యావసర సామగ్రి ధరలు భారీగా తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులు సైతం తగ్గించిన ధరలతోనే విక్రయించాలని తెలిపింది. అయితే, పాత వస్తువులపై కొత్త రేట్లతో స్టిక్కర్లను వేయనున్నారు. ఒకవేళ ఎవరైనా పాత రేట్లతోనే విక్రయిస్తే ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్ పోర్టల్ ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (NCH)లోని ఇన్‌గ్రామ్ పోర్టల్‌లో స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
నిజంగా ఊరటే!
సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ ధరలు తగ్గనున్నట్లు ఇటీవలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వాటి ప్రకారం దైనందిన అవసరాల వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తగ్గాయి. దీంతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి. మరో ప్రధాన ఊరట ఏంటంటే.. జీవన, ఆరోగ్య బీమా సేవలపై జీఎస్టీ (GST) రేటును సున్నాకి తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది.
తగ్గుతాయ్..
* రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తుల ధరల్లో ఎటువంటి మార్పులూ ఉండవు. అంతకంటే ఎక్కువ ధరలు ఉండే దుస్తులు, ఇతర వస్త్ర సామగ్రి ధరలు తగ్గనున్నాయి.
* రక్షణ రంగంలో ఉపయోగించే పరికరాలు, డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్ లు, కళాకృతులు, పురాతన వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. వాటిపై ఇప్పటి వరకు 18 శాతం ఉన్ పన్నును 0 శాతం చేశారు
* పాలు, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి, కొన్ని రకాల మందులు, పుస్తకాలు, పెన్సిల్ ధరలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతాయి.
* కాటన్, జ్యూట్ హ్యాండ్ బ్యాగ్స్, వుడ్, బాంబూ ఫర్నిచర్, కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు కూడా.
* పౌడర్లు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, చాక్లెట్స్, కేక్స్, బిస్కెట్స్, కాఫీ, టీ ఎక్స్ట్రాక్ట్స్, ఐస్ క్రీమ్, మినరల్ వాటర్ పై 18 శాతం ఉన్న రేపటి నుంచి 5 శాతానికి రానుంది.
* ఎయిర్ కండీషనర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్, టెలివిజన్ సెట్లు, సెట్ టాప్ బాక్స్‌లు, 1200cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/LPG/CNG వాహనాలు, 1500cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలపై ఉన్న పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది.
పెరుగుతాయ్..
* రూ. 2500 కంటే ఎక్కువ విలువ ఉన్న దుస్తులు, కాటన్ క్విల్ట్స్, కొన్ని రకాల కాగితం, పేపర్‌బోర్డ్ ధరలు 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగాయి.
* పాన్ మసాలా, టొబాకో ఉత్పత్తులు (సిగరెట్లు, సిగార్లు, ఇతర టొబాకో రూపాలు), కెఫినేటెడ్ బీవరేజెస్, కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, 1200cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న కార్లు, 350cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లు, వ్యక్తిగత వినియోగం కోసం విమానాలు, యాట్లు, రివాల్వర్లు, పిస్టల్స్ 28 శాతం నుంచి 40 శాతానికి పెరుగుతాయి.
* ఇతర నాన్-ఆల్కహాలిక్ బేవరేజెస్, లగ్జరీ, గూడ్స్‌పై ఉన్న పన్ను 18 శాతం నుంచి 40 శాతానికి పెరగనున్నాయి.
రేపటి నుంచి సెమినార్లు
జీఎస్టీ రేట్ల సవరణలపై మోదీకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రేపటి నుంచి 29 వరకు సెమినార్లు నిర్వహిస్తామని అన్నారు. ఎవరైనా సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. పనికి వాలిన వాళ్లు ఎన్నో మాట్లాడతారని విమర్శించారు. దుష్ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు.
…………………………………………………
