సుప్రీంకోర్టు
* మానవతా సంక్షోభం నెలకొందని పిల్
* తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టుకు అభ్యర్థన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొన్ని రోజులుగా 1,000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ‘ఇండిగో ఆల్ ప్యాసింజర్ అండ్ అనదర్’ పేరుతో న్యాయవాది నరేంద్ర మిశ్రా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. విమానాల రద్దు, తీవ్ర జాప్యం కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో ‘మానవతా సంక్షోభం’ తలెత్తిందని పిటిషన్లో పేర్కొన్నారు. వృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారితో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నీరు, విశ్రాంతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన విమాన డ్యూటీ సమయ పరిమితి నిబంధనల అమలులో ప్రణాళిక లోపం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని ఇండిగో బహిరంగంగా అంగీకరించింది. అయితే, ఈ మార్పులను ముందుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ఇండిగోతో పాటు డీజీసీఏ కూడా విఫలమయ్యాయని పిటిషన్లో ఆరోపించారు. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కీలక మార్గాల్లో టికెట్ ధరలను రూ.50,000 వరకు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇతర విమానాల్లో లేదా రైళ్లలో ఉచితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఇండిగోను ఆదేశించాలని అభ్యర్థించారు. అలాగే డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
…………………………………

