* మరికొంత మంది పోలీసులను సాక్షులుగా చేర్చాం
* ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదు
* సరైన సమయంలో కేసు వివరాలు వెల్లడిస్తాం..
సీపీ శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping ) కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, రాజకీయ నాయకుల ప్రమేయంపై విచారణ చేపడుతున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ( CP Srinivasa Reddy ) తెలిపారు. నిందితులు చాలా తెలివిగా వ్యవహరించారని, వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించారు. ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియలేదని, అమెరికాలో ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ఇంకా ఇంటర్ పోల్‌ను సంప్రదించలేదని వివరించారు. ప్రభాకర్ రావుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయనను పట్టుకోవడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసుల ప్రమేయం ఉంది కాబట్టే అరెస్ట్ చేశామని చెప్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు. కొంత మంది పోలీసులను సాక్షులుగా చేర్చినట్లు వెల్లడించారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు చెబుతామని, అప్పటి వరకు నిరాధార వార్తలతో గందరగోళానికి గురి చేయవద్దని సీపీ సూచించారు.
———————————–